ఇసుక తవ్వకాలను అడ్డుకున్న తిప్పసముద్రం గ్రామస్థులు - VillagerstopSandTransport
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 1, 2024, 10:43 AM IST
Villagers Protest to Stop Sand Transport: అన్నమయ్య జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలం పాపాగ్ని నదిలో ఇసుక తరలింపు వివాదాస్పదమైంది. గత వారం రోజులుగా భారీ యంత్రాలతో అక్రమంగా ఇసుకను తరలిస్తుండగా గ్రామస్థులు అడ్డుకున్నారు. తమకు ఇసుక రీచ్ అనుమతి ఉందంటూ ఆదివారం పొక్లెయిన్లతో ఇసుక దిబ్బలు వేశారు. గ్రామస్థులు పొక్లెయిన్లను అడ్డుకుని పోలీసులకు ఫిర్యాదు చేయటంతో ఘటనా స్థలానికి చేరుకున్నారు.
లీజుదారులకు రామాపురం వద్ద మాత్రమే తవ్వకాలకు అనుమతులు ఉన్నాయని, జంబుగానిపల్లి వద్ద తవ్వకాలకు అనుమతుల్లేవని గ్రామస్థులు తేల్చి చెప్పారు. తమ గ్రామం వద్ద చెక్‌డ్యాం వరదలతో కొట్టుకుపోయిందని, ఇక్కడ ఉన్న ఇసుకను తరలిస్తే తమ బోర్లు ఎండిపోతాయని ఆవేదన వ్యక్తం చేశారు. తవ్వకాలు జరపడం వల్ల భూములు కోతకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమతులు ఎవరు ఇస్తున్నారో తెలియడం లేదని కలెక్టర్, తహసీల్దారు వచ్చి సమాధానం చెప్పే వరకు తాము కదలమని యంత్రాల ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని యంత్రాలను గ్రామం బయటకు పంపేశారు. ఇసుక తవ్వకాలతో భూగర్భ జలాలను కోల్పోతున్నామని, మళ్లీ ఇసుక తవ్వకాలకు వస్తే ఆందోళనలు ఉద్ధృతం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు.