CM Chandrababu Teleconference with TDP Leaders: 76 లక్షల సభ్యత్వాల నమోదుతో దేశంలోనే చరిత్ర సృష్టించామని సీఎం చంద్రబాబు అన్నారు. అందరి భాగస్వామ్యంతో ఇది సాధ్యం అయ్యిందని వెల్లడించారు. ఇప్పటి వరకు తెలుగురాష్ట్రాల్లో 76,89,103 మంది పార్టీపై నమ్మకం, విశ్వాసంతో సభ్యత్వం తీసుకుంటున్నారని పేర్కొన్నారు. ప్రతి నలుగురిలో ఒకరు టీడీపీ సభ్యులుగా చేరాలనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేశంలో ఏ పార్టీకి లేని కార్యకర్తల బలం టీడీపీకి ఉందని అది మెంబర్షిప్ ద్వారా మరోసారి నిరూపితమైందని స్పష్టం చేసారు. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కార్యకర్తలతో సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.
కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా 135 కోట్లు మన కార్యకర్తలకు ఖర్చు చేశామని సీఎం గుర్తు చేశారు. 100 సభ్యత్వంతో 5 లక్షల బీమా అందించే ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. 685 మంది శాశ్వత సభ్యత్వం తీసుకున్నారని, శాశ్వత సభ్యత్వం ద్వారా వచ్చిన నిధిని కార్యకర్తల కోసం ఖర్చు చేస్తామని అన్నారు. శాశ్వత సభ్యత్వం తీసుకున్న నియోజకవర్గాల్లో మంగళగిరి 71, జీడీ నెల్లూరు 38, పెదకూరపాడు 37తో ముందు వరసలో ఉన్నాయని తెలిపారు. ఈ నెల 30లోపు సభ్యత్వ నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని చెప్పారు. సభ్యత్వం తీసుకున్న వారికి త్వరలోనే కార్డులు అందిస్తామని వెల్లడించారు.
పరిటాల స్వగ్రామం పసుపుమయం - ఏం జరిగిందంటే!
సభ్యత్వం తీసుకున్న వారికి వచ్చే జనవరి నుండి బీమా అమలవుతుందని అయినప్పటికీ ఇప్పటికే ప్రమాదంలో చనిపోయిన కార్యకర్తల కుటుంబాలకు పార్టీ తరపున రూ.2 లక్షలు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా గెలిచి నేడు అధికారంలో ఉన్నారంటే దానికి కారణం పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలేనని సీఎం చంద్రబాబు చెప్పారు. కార్యకర్తలకు న్యాయం చేసి ఆదుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలు ఈ విషయంలో చొరవ చూపాలని కోరారు. కార్యకర్తల మనోభావాలు దృష్టిలో పెట్టుకుని నాయకులు పని చేయాలని తెలిపారు. పార్టీ జెండా మోసింది, మోసేది కార్యకర్తలేనని వారిని నిత్యం గౌరవించాలని నేతలకు సీఎం సూచించారు.
ఇప్పటికే మెజార్టీ నామినేటెడ్ పదవులు భర్తీ చేశామని మిగతా పదవులు కూడా త్వరలో భర్తీ చేస్తామని సీఎం అన్నారు. అందరి అభిప్రాయాలు తీసుకోవడంతో పాటు మెరిట్ ప్రకారం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిలో పదవులు కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వం శాశ్వతంగా అధికారంలో ఉంటే రాష్ట్రానికి, ప్రజలకు మంచి జరుగుతుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అధికారిక కార్యక్రమాలు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. పార్టీకి ఎవరూ చెడ్డపేరు తీసుకురావొద్దని అలాంటి వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. 6 నెలల కాలంలో అనేక సవాళ్లు, అవరోధాలు ఉన్నా మంచి ఫలితాలు సాధించామన్నారు.
పనితీరు ఆధారంగానే పదవులు - ఏమీ చేయకుండా ఉంటే కుదరదు: చంద్రబాబు
మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై అభిప్రాయ సేకరణ: సీఎం చంద్రబాబు