Farmers Revolt Against Merchants Due To Cheating In Purchase Of Lentils : కందుల కోనుగోలులో మోసం చేసిన దళారులు, హమాలీలపై రైతులు తిరగబడ్డ ఘటన అనంతపురం జిల్లాలో కలకలం రేపింది. తూకాల్లో క్వింటానికి దాదాపు 25 కిలోలు మోసం చేయడంతో పసిగట్టిన రైతులు వారిని నిలదీశారు. దీంతో వారు లారీ, కాటా, బస్తాలను వదిలేసి పరారయ్యారు. ఈ ఘటన జిల్లాలోని వజ్రకరూరు మండలం చాబాల గ్రామంలో జరిగింది.
గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం " కొంతమంది దళారులు మార్కెట్ ధర కంటే అధిక ధరకు కందులను కొనుగోలు చేస్తామని గ్రామానికి వచ్చారు. మార్కెట్లో క్వింటా కందుల ధర రూ.8 వేలు పలుకుతుండగా తాము రూ. 9,100 ధర ఇస్తామని రైతులను నమ్మించారు. దీంతో రైతులు ఆశ పడి వారికి అమ్మడానికి ఒప్పుకున్నారు. అయితే కందులు కోనుగోలు సమయంలో తూకంలో మార్పులు చేసి 50 కేజీలు తూగాల్సిన చోట 62 కేజీలు తూగేలా చేశారు.
ఇలా ప్రతి 50 కిలోల బస్తాకు 12 నుంచి 16 కిలోల కందులను తూకాల్లో మోసం చేసి కొట్టేసే ప్రయత్నం చేశారు. చివరికి దళారులు చేస్తున్న మోసాన్ని చాబాల రైతులు గుర్తించారు. అనంతరం దళారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. రైతులు తిరగబడడంతో పంట కొనడానికి వచ్చిన దళారులు, హమాలీలు అక్కడి నుంచి పరారయ్యారు. లారీ, కాటా, బస్తాలను వదిలేసి పారిపోయారు" అని గ్రామస్థులు తెలిపారు. దళారుల మోసంపై వజ్రకరూరు పోలీసులకు ఫిర్యాదు చేస్తామని రైతులు తెలిపారు.
మహా మాయగాళ్లు - మాటలతో లాక్ చేస్తారు - ఆపై అందినకాడికి సొమ్ము కాజేస్తారు
'పరిశీలన తర్వాత సందేహాలు పెరిగాయ్' - విశాఖ డెయిరీపై ఆడిట్ జరగాల్సిందే : ప్రత్యేక హౌస్ కమిటీ