Public Grievance at TDP Central Office : టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజావేదికకు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. వివిధ సమస్యలతో తరలి వచ్చిన బాధితుల నుంచి శాసనమండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, ఆయిల్‌ఫెడ్ ఛైర్మన్ గండి బాబ్జీ వినతులు స్వీకరించారు. పలు సమస్యలపై అధికారులతో మాట్లాడిన అనురాధ పరిష్కారం దిశగా చర్యలు తీసుకున్నారు.
తనకు తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూరికార్డుల్ని తహసీల్దార్ లంచం తీసుకొని వేరొకరి పేరుతో మార్చారని వైఎస్సార్ జిల్లా ముద్దనూరు మండలం చెన్నారెడ్డిపల్లెకు చెందిన సిద్ధన వెంకట లక్షుమమ్మ వాపోయారు. ఆయనపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని ప్రజావేదికలో ఫిర్యాదు చేశారు. వారసత్వంగా వచ్చిన భూమిని మల్లయ్య అనే వ్యక్తి ఆక్రమించుకుని దొంగ పాస్‌పుస్తకాలు సృష్టించారని నంద్యాల జిల్లా బనగానపల్లెకు చెందిన బొల్లి మధు, సౌభాగ్యమ్మ వాపోయారు.
'నాపై కక్షగట్టారు - వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అండతో తప్పుడు కేసులు'
కిర్గిస్థాన్‌లో ఎంబీబీఎస్ చదువుతున్న తన కుమార్తెకు ప్రభుత్వం తరఫున ఆర్థిక సాయం అందించాలని బాపట్లలోని ప్యాడిసన్‌పేటకు చెందిన సాల్మన్ కోరారు. తన స్థలంలో వేసిన డ్రైనేజీ పైపులు తొలగించాలని ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం కె.రాజుపాలేనికి చెందిన సత్యనారాయణ వినతిపత్రం సమర్పించారు. భూ వివరాల ఆన్‌లైన్ నమోదులో దొర్లిన తప్పుల్ని సరిచేయాలని నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుయర్రబల్లికి చెందిన చేబ్రోలు రాజగోపాల్ కోరారు.