APPSC Group-1 Mains Exam Dates 2025 : రాష్ట్రంలో గ్రూప్-1 ఉద్యోగాల నియమాకం కోసం మెయిన్స్ పరీక్షల తేదీలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. మే 3 నుంచి 9 వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు తెలిపింది. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారిలో 1:50 చొప్పున అభ్యర్థులను మెయిన్స్‌కి ఎంపిక చేసింది. ఈ పరీక్షలు రాసేందుకు 4496 మంది అభ్యర్థులు అర్హత పొందినట్లు వెల్లడించింది.
2023 డిసెంబర్లో 89 గ్రూప్-1 ఉద్యోగాల నియామకానికి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చింది. గతేడాది మార్చి 17న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. అయితే వైఎస్సార్సీపీ సర్కార్ ఎన్నికల సమయంలో హడావుడిగా ప్రిలిమ్స్ నిర్వహించడం వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని, మెయిన్స్ పరీక్ష రాసేందుకు తగిన గడువును ఇవ్వాలని కమిషన్ని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు.
APPSC Group-1 Mains : ఈ క్రమంలోనే అభ్యర్థులు మెయిన్స్‌కి సన్నద్దమయ్యేందుకు వీలుగా మరింత గడువు ఇవ్వాలని ఏపీపీఎస్సీ నిర్ణయించింది. ఇందులో భాగంగానే మే 3 నుంచి 9 వరకు మెయిన్స్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నం, విజయవాడ , తిరుపతి, అమలాపురంలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. ఈ పరీక్షలను డిస్క్రిప్టివ్ టైప్‌లో నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ఇంఛార్జ్ కార్యదర్శి ఐ . నరసింహమూర్తి తెలిపారు. మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వనున్నట్లు ఆయన వెల్లడించారు.
ఏపీ యువతకు గుడ్‌న్యూస్ -ఈ ఉద్యోగాలకు పరీక్షా తేదీలు ప్రకటించిన APPSC