Drinking Water Problem: గిరిజనుల దాహం కేకలు.. నీటి ఊటలే ఆధారం - అనకాపల్లి జిల్లాలో తాగునీటి సమస్య న్యూస్
🎬 Watch Now: Feature Video
Tribals Drinking Water Problem: తరాలు మారినా గిరిజన బతుకుల్లో మాత్రం ఎలాంటి ప్రగతి కనపడటం లేదు. రహదారి సదుపాయం, వైద్యం, విద్యుత్, విద్య వంటి కనీస మౌలిక వసతుల లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గిరిజనుల అభివృద్ధికి తోడ్పతామని చెప్పిన పాలకుల మాటలన్నీ ఎండమావులవుతున్నాయి. ఫలితంగా వీరి జీవితాల్లో ఎలాంటి అభివృద్ధి కనిపించడం లేదు. ఈ దుర్భర పరిస్థితులకు అనకాపల్లి జిల్లా రావికమతం మండలం చీమలపాడు శివారు కడగడ్డ గ్రామానికి చెందిన గిరిజనులే నిదర్శనం. సుమారు 50 కుటుంబాలు నివాసముంటున్న ఆ గ్రామంలో రక్షిత నీటి పథకాలు లేవు.
తాగునీటి సదుపాయం లేక అక్కడి ప్రజలు వాగుల వద్ద ఊటలపై ఆధారపడి జీవనాన్ని నెట్టుకొస్తున్నారు. ఫలితంగా అనేక వ్యాధులకు గురవుతున్నారు. దీనిపై ఎన్నిసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని పరిస్థితి. గిరిజన గ్రామాల మౌలిక వసతులకు నిధులు కేటాయింపు ఎప్పటికప్పుడే కాగితాలకే పరిమితం అవుతున్నాయి. ప్రస్తుత వేసవి సీజన్లో తాగునీటి సమస్య మరింత జఠిలమవుతోంది. తాగునీరు లేక తీవ్రంగా అల్లాడిపోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.