Vizag Gangamma Thalli Pooja : 2004 డిసెంబరు 26వ తేదీ (20 Years Of Tsunami). నాటి సునామీ సృష్టించిన బీభత్సానికి నేటితో 20 ఏళ్లు. ఈ బీభత్సం కారణంగా రాష్ట్రంలో మొత్తం 105 మంది ప్రాణాలు కోల్పోయారు. కానీ విశాఖపట్నం తీరం మాత్రం చెక్కుచెదరలేదు. సహజసిద్ధంగా ఏర్పడిన డాల్ఫిన్ నోస్, సముద్రంలోకి చొచ్చుకొచ్చినట్లుండే కొండల కారణంగా విశాఖ నగరానికి నష్టం తప్పింది. ఎక్కడా ప్రాణనష్టం కూడా జరగలేదు. దీనికి గంగమ్మ తల్లి దీవెనలే కారణమని విశాఖపట్నం మత్స్యకారులు నమ్ముతున్నారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం డిసెంబరు 26వ తేదీన పెదజాలారిపేటలో గంగమ్మ తల్లి జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 26న రోజు పెద్దఎత్తున మత్స్యకారులు తీరం వద్దకు చేరుకుని పూజలు చేస్తున్నారు.
ప్రమాదాలు జరగకూడదని గంగమ్మకు పూజలు : సునామీ వచ్చి 20 ఏళ్లు పూర్తి అయిన సందర్భంగా విశాఖ పెద్దజాలరిపేట వద్ద సముద్ర తీరంలో మత్స్యకారులు గంగమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. పూజల్లో విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ పాల్గొన్నారు. సముద్రంలో పాలు, పసుపు నీళ్లు పోసి గంగమ్మకు దండాలు పెట్టిన మొక్కులు చెల్లించుకుంటున్నారు. సునామీ వచ్చి పోయినప్పటి నుంచి సముద్ర తీరంలో పూజలు చేస్తున్నట్లు మహిళలు తెలిపారు. చేపల వేటకు వెళ్లిన వారికి ఎలాంటి ప్రమాదాలు జరగకూడదని మంచిగా వేట జరగాలని గంగమ్మకు పూజలు చేస్తామని తెలిపారు.
"2004 సంవత్సరం డిసెంబర్లో సునామీ వచ్చింది. ఒక్క ప్రాణానికి హాని కలగకుండా గంగమ్మ తల్లి మమ్మల్ని కాపాడింది. ఈ రోజుకు 20 ఏళ్లు అయ్యింది. అప్పటి నుంచి గంగమ్మ తల్లికి పూజలు చేస్తున్నాం. మమ్మల్ని చల్లగా చూడాలని వేడుకుంటాం."- మత్స్యకారులు
కడలి కల్లోలం - రాకాసి అలకు 105మంది బలి
20 Years of 2004 Tsunami : 2004 డిసెంబరు 26వ తేదీ. ఎటువంటి తుపాను హెచ్చరికలు జారీ చేయలేదు. ఎక్కడా చినుకు జాడ లేదు. కానీ, హిందూ మహాసముద్రంలో ఒక్కసారిగా అల్లకల్లోలం నెలకొంది. ఒక్కసారిగా రాకాసి అలలు ఎగసిపడటంతో రెప్పపాటులోనే దక్షిణ భారతంలోని తీర ప్రాంతాల్లో బీభత్సం సృష్టించింది. ఏకకాలంలో 14 దేశాలు ఈ జల ప్రళయాన్ని ఎదుర్కొన్నాయి. సముద్రాన్ని నమ్ముకుని బతుకుతున్న మత్స్యకారుల జీవితాలు ఈ ఒక్క ఘటనతో ఛిన్నాభిన్నమయ్యాయి. దీంతో ఇప్పటికీ సముద్రం ఉప్పొంగితే గంగపుత్రులు నాటి కల్లోలాన్ని గుర్తుచేసుకుంటూ భయపడుతున్నారు. నాటి సునామీ సృష్టించిన బీభత్సానికి నేటితో 20 ఏళ్లు.
ఏపీలో మూడు జిల్లాల్లో అధికం : రాకాసి అలల తాకిడితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 985 కిలో మీటర్ల తీర ప్రాంతం ప్రభావితమైంది. ఆ రోజు ఉదయం 9 గంటల 5 నిమిషాల సమయంలో భారీ అలలు తీరాన్ని తాకాయి. సగటున 4 మీటర్ల ఎత్తున రాకాసి అలలు ఎగసిపడ్డాయి. నాటి విధ్వంసానికి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 301 గ్రామాలు ప్రభావితమయ్యాయి. ఈ బీభత్సంలో మొత్తం 105 మంది ప్రాణాలు కోల్పోయారు. కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ప్రభావం ఎక్కువగా నమోదైంది. ఈ మూడు జిల్లాల్లోనే 82 మంది ప్రాణాలు కోల్పోయారు.
సునామీ ప్రభావంతో వివిధ జిల్లాల్లో మరణించినవారి సంఖ్య
- కృష్ణా జిల్లా: 27
- నెల్లూరు జిల్లా: 20
- ప్రకాశం జిల్లా: 35
- ఇతర ప్రాంతాల్లో: 23
రాకాసి అల - 20 ఏళ్ల పీడకల - గుర్తు చేస్తే గుండెలదిరే పరిస్థితి
సునామీకి 20ఏళ్లు- అండమాన్ నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు అతలాకుతలం- నేటికీ తలచుకున్నా హడలే!