Lokesh Face to Face With Farmers: "అబద్ధాలతో అధికారంలోకి వచ్చిన జగన్.. రైతులను మోసం చేశాడు" - రాజోలు గండికోట జలాశయాల బాధితులతో లోకేశ్
🎬 Watch Now: Feature Video
Lokesh Face to Face With Farmers in Suddhapalli: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ప్రజలను, రైతులను అన్ని వర్గాల వారిని దగా చేసి అధికారంలోకి వచ్చాడని.. ఈసారి ఆయనకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గండికోట, రాజోలి జలాశయం ముంపు వాసుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని లోకేశ్.. రైతులకు హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్ర వైఎస్ఆర్ జిల్లాలో ప్రవేశించిన సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం మండలం సుద్దపల్లిలో రైతులతో లోకేశ్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు గండికోట, రాజోలి జలాశయాల ముంపు సమస్యలను లోకేశ్‌తో ప్రస్తావించారు. ప్రధానంగా గండికోట ముంపు ప్రాంతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కోల్పోయిన వారికి పది లక్షల రూపాయల పరిహారం ఇస్తానని మాట ఇచ్చినా.. అది కొందరికే నెరవేరిందని చాలా మందికి ఆ పరిహారం అందలేదని రైతులు లోకేశ్ దృష్టికి తీసుకెళ్లారు.
పునరావాసం ప్యాకేజీతో పాటు ఆ ప్రాంతంలో మౌలిక వసతుల కల్పన కూడా చేయలేదని విన్నవించారు. రాజోలి జలాశయం భూములు కోల్పోయిన రైతులకు ఎకరాకు 12 లక్షల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ, ఎలాంటి నిధులు మంజూరు చేయడం లేదని రైతులు వాపోయారు. రైతుల సమస్యలన్నింటిని సానుకూలంగా స్పందించిన వాళ్లందరికీ భరోసా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి దగా చేసి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చారని.. తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే ఈ ప్రాంత రైతుల సమస్యలన్నింటినీ కూడా నెరవేర్చే విధంగా కృషి చేస్తానని తెలియజేశారు. మాయమాటలతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చారని ఈసారి ఆ పరిస్థితి రాకుండా చిత్తుచిత్తుగా ఓడించే విధంగా రైతులే కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు.