స్కూల్‌కు వెళ్తారనుకుంటే అదృశ్యమయ్యారు - అన్నదమ్ముళ్ల ఆచూకీ కోసం పోలీసుల గాలింపు
🎬 Watch Now: Feature Video
Students Missing in RTC Bus Stand: పాఠశాలకు వెళ్తామని తల్లికి చెప్పిన ఇద్దరు విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్‌లో అదృశ్యమయ్యారు. ఈ ఘటన సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ప్రకారం తుమ్మలబైలు తండాకు చెందిన శ్రీనివాసులు నాయక్, విజయ కుమారి దంపతులకు ఇద్దరు కుమారులు ధనుష్ నాయక్ (14), శశాంత్ నాయక్ (12). వీరు నల్లమాడలోని గిరిజన గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. నాలుగు రోజుల క్రితం అన్నదమ్ములిద్దరూ సొంత ఊరికి వచ్చారు. మంగళవారం వీరిద్దరినీ తల్లి విజయ కుమారి పాఠశాలకు పంపేందుకు కదిరి ఆర్టీసీ బస్టాండ్‌కు తీసుకువచ్చారు. బస్సు ఆలస్యం అవుతుందని తెలియడంతో పిల్లలిద్దరూ తల్లిని ఊరికి వెళ్ళమని, బస్సు రాగానే తాము పాఠశాలకు వెళ్తామని చెప్పారు. దీంతో ఆమె పిల్లలను బస్టాండులో వదిలి ఊరికి వెళ్లింది.
పిల్లలు రాలేదని పాఠశాల సిబ్బంది తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు పిల్లలు బస్టాండ్ నుంచి ఎక్కడికి వెళ్లారో తెలుసుకునేందుకు కదిరికి వచ్చి పిల్లల కోసం వెతికారు. అయినా వారి ఆచూకీ లభ్యం కాలేదు. భయాందోళనకు గురై కదిరి అర్బన్ పోలీస్ స్టేషన్లో పిల్లల అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణలో ఉన్న సీసీ పుటేజ్ పోలీసులు పరిశీలించారు. బస్సు కోసం ఎదురుచూసిన ఇద్దరు బాలురు పుస్తకాల బ్యాగును బస్టాండ్ ఆవరణలో ఉంచి బయటకు వెళ్లినట్టు సీసీ ఫుటేజ్‌లో రికార్డ్ అయింది. ఆచూకీ కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు.