Student Dies Due To Scorpion Bite In School : పాఠశాలలో తేలు కాటు.. విద్యార్థి మృతి - Scorpion Bite In School
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 6, 2023, 1:57 PM IST
Student Dies Due To Scorpion Bite In School : పాఠశాలలో తేలు కుట్టి ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన గురువారం ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం నాయుడుపల్లె ఎస్సీపాలెంలో చోటు చేసుకుంది. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోట రామకృష్ణారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సీపాలేనికి చెందిన కోట్ల కోటేశ్వరరావు, కొండమ్మ దంపతుల మూడో కుమారుడు రవి కిరణ్ (14) రాయవరం జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 4న మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత విద్యార్థులు పాఠశాల ఆవరణలోని చెట్ల కింద స్టడీ అవర్స్‌లో కూర్చున్నారు. ఆ సమయంలో రవికిరణ్ తన బ్యాగ్‌లో చేయి పెట్టగానే ఏదో కుట్టినట్లు తోటి విద్యార్థులకు చెప్పాడు. వెంటనే ఉపాధ్యాయుడు మార్కాపురం ప్రభుత్వ జిల్లా వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. మృతుడి బంధువులు పాఠశాలకు వచ్చి ఆందోళన చేశారు. దీనిపై మార్కాపురం గ్రామీణ ఎన్సై వెంకటేశ్వర నాయక్ వివరణ కోరగా.. రాయవరం ఉన్నత పాఠశాలలో విద్యర్థి మృతి చెందిన విషయం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు చెందిన ఔటోపోస్ట్ పోలీసుల ద్వారా తెలిసిందన్నారు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదన్నారు.