Strange rituals for rain వర్షాల కోసం రాతి బండపై సామూహిక భోజనం.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా! - వర్షాల కోసం
🎬 Watch Now: Feature Video
Strange rituals for rain: అలవాట్లు ఆచారంగా మారుతుంటాయి.. ఆచారాలు సంప్రదాయాలు అవుతుంటాయి. ప్రతి మానవ సమూహం తన ఉనికిని చాటుకునేలా ప్రత్యేక పద్ధతులను అనుసరిస్తుంటుంది. అయితే, వర్షాలు ఆలస్యమవుతున్న తరుణంలో వరుణ దేవుడి కరుణ కోసం ఎవరికి తోచిన పూజలు, కార్యక్రమాలు వాళ్లు చేపడుతున్నారు. సహజంగా వరుణ యాగాలు, పూజలు శాస్త్రోక్తంగా జరుగుతుంటాయి. కానీ, కొంత మంది అందుకు భిన్నంగా కొన్ని వింత నమ్మకాలను కొనసాగిస్తున్నారు. వర్షాలు కురవాలని చాలా చోట్ల కప్పలకు పెళ్లిళ్లు చేస్తుంటారు. ఈ పద్ధతి చాలా మందికి తెలిసిందే. కాగా, ఇటీవల కర్నాటకలోని విజయపుర జిల్లా తాలికోట్ తాలూకా కలకేరి గ్రామలో శ్మశానవాటికలో సమాధులు తవ్వి మృతదేహాలపై నీళ్లు చల్లారు. వర్షం కోసం గతేడాది ఇలాగే చేయడం వల్ల అదే పద్ధతిని కొనసాగిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. కాగా, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలోని గుడుపల్లె మండలం బేగ్గిలపల్లె పంచాయతీ ప్రజలు వర్షాలు కురవాలని ప్రత్యేక పూజలు చేశారు. వందల సంఖ్యలో చిన్న మల్లప్ప కొండ పైకి చేరుకున్న పరిసర గ్రామాల జనం... కొండపైన మల్లేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కొండపైనే భోజనాలు వండి రాతి బండపై భోజనం వడ్డించి ఆరగించారు. విస్తరాకులు లేకుండా రాతి బండపై భోజనాలు పూర్తిచేశారు. గడచిన 500 ఏళ్లుగా పెద్దలు పాటిస్తున్న ఆచారం మేరకు వర్షాల కోసం ఇలా బండపై భోజనం చేశామని తెలిపారు. బండపై తినడం వల్ల వరుణ దేవుడు కరుణించి వర్షాలు సంవృద్ధిగా కురుస్తాయని రైతులు వెల్లడించారు. తెలంగాణలోనూ ఇలాంటి ఆచారం కొనసాగుతోంది. "వరద పాశం" అని పిలుచుకునే ఈ కార్యక్రమంలో భాగంగా కులాల వారీగా గంగమ్మ జాతర నిర్వహించి రాతి బండపైనే భోజనాలు ఆరగిస్తుంటారు.