Steel Plant Workers Protest: విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనాన్ని ముట్టడించిన కార్మిక సంఘాలు.. - విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం
🎬 Watch Now: Feature Video
Steel Plant Workers Protest: విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులు కదం తొక్కారు.సెయిల్ తో సమానంగా వేతన సవరణ ఒప్పందం అమలు చేయాలంటూ పరిపాలన భవనం ముట్టడికి దిగారు. ఈ ఉదయం నుంచి పరిపాలన భవనానికి వెళ్లే అన్ని రహదారుల పైన కార్మికులు బైఠాయించారు. ఈ క్రమంలో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిపాలన భవనం వద్ద ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నాయి. పరిపాలన భవనానికి వెళ్లే అన్ని రహదారులపై బైఠాయించి.. వాహనాలు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో భారీగా మోహరించిన పోలీసులు.. కార్మికులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది. ఉక్కు కార్మికులకి ఆరు సంవత్సరాలుగా వేతన సవరణ ఒప్పందాన్ని అమలు చేయకపోవడాన్ని వారు తీవ్రంగా నిరసిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అది అమలు చేయకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. స్టీల్ ప్లాంట్ కార్మికులు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలియజేయడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.