Several People died with Electric Shock: వర్షాల వేళ.. ఆందోళన కలిగిస్తున్న విద్యుదాఘాతాలు.. పలు కుటుంబాల్లో విషాదం
🎬 Watch Now: Feature Video
Several People Died due to Electric Shock: రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలు అవి. వారే కుటుంబానికి పెద్ద దిక్కు. ఉపాధిహామీ పని కోసం అప్పుడే ఇంటి నుంచి వెళ్లారు. అంతలోనే పెను విషాదం చోటు చేసుకుంది. కూలీ పనుల మాటున విద్యుత్తు తీగ యమపాశంగా మారడంతో రెండు నిండు ప్రాణాలు గాలిలో కలసిపోయాయి. ఈ ఘటనలో పూడి అప్పలనాయుడు(60), బడి రామ్మూర్తి (55) విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందగా.. వెంపడాపు రామిశెట్టి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఈ విషాదకర ఘటన విజయనగరం జిల్లాలోని బాడంగి మండలం పూడివలసలో మంగళవారం సాయంత్రం జరిగింది. రెండుపూటల పని కావటంతో ఉదయం ఉపాధిహామీ పని ముగించి.. మధ్యాహ్నం పనికి హజరయ్యారు. గ్రామంలో గోడమాను మధుము నుంచి పూడి పాలమను వరకు ఫీల్డ్ చానల్ పూడిక తీత పనులు చేస్తున్నారు. ఈ పనులు ప్రారంభమైన కొద్దిసేపటికే వారు విద్యుదాఘాతానికి గురయ్యారు. మధుములో విద్యుత్ తీగ పడి ఉంది. దీనిని గమనించకపోవటంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
మరోవైపు.. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండల పరిధిలోని జానకిరాంపురం బీసీ కాలనీలో విద్యుత్ షాక్కు గురై తల్లీ కుమార్తెలిద్దరూ మృతి చెందారు. గ్రామానికి చెందిన వల్లభు అనూష(23), చిన్నారి వల్లభ దన్విక (1).. ఇంట్లో వాటర్ హీటర్ అకస్మాత్తుగా పట్టుకోవడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే నేలకు ఒరిగారు. ఇది గమనించిన వెంటనే కుంటుబ సభ్యులు.. సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదంతో జానకిరామపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.