The Unstoppable Death Toll of Olive Ridley Turtles : కాకినాడ బీచ్ రోడ్ పరిసర ప్రాంతాల్లో ఇటీవల ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మృతి చెందుతుండడంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. ఆలివ్ రిడ్లీ తాబేళ్ల మృతికి వాస్తవ కారణాలపై దర్యాప్తు చేపట్టాలని, తాబేళ్ల సంరక్షణ కోసం తీసుకోవలసిన చర్యలపై సమగ్ర అధ్యయనం చేయాలని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్‌ని పవన్ ఆదేశించారు. అయితే బాపట్ల జిల్లా సూర్యలంకలో సైతం ఆలివ్ రిడ్లే తాబేలు మృత్యువాత పడుతున్నాయి.
సూర్యలంకలో సైతం.. బాపట్ల జిల్లాలోని సూర్యలంకలో అరుదైన ఆలివ్ రిడ్లే తాబేలు మృత్యువాత పడుతున్నాయి. ఏటా నవంబర్ నుంచి మార్చి మధ్య గుడ్లు పెట్టేందుకు ఈ జాతి తాబేలు థాయిలాండ్, మలేషియా, ఇండోనేషియా, తీరాల నుంచి వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి జిల్లాలోని తీర ప్రాంతానికి వచ్చి గుడ్లు పెడతాయి. గుడ్లు పిల్లలుగా మారిన అనంతరం తిరిగి వెళ్తాయి.
అటవీశాఖ ఆధ్వర్యంలో సూర్యలంక తీరంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రధానంగా తాబేలు గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చే సమయంలో వలలు,వేట పడవలు తగలడం, కాలుష్యం కారణంగా చనిపోతున్నట్లు తెలుస్తోంది. ఆలివ్ రిడ్లే తాబేళ్ల కోసం సూర్యలంక, రామచంద్రపురం, రామాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం కుంకుడుచెట్లపాలెం, ఏటిమొగ, నిజాంపట్నంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తామన్నారు. అవి చేపల వలలో చిక్కి చనిపోకుండా ఉండేలా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తామన్నారు. తాబేలు పెట్టిన గుడ్లను అటవీ శాఖ సిబ్బంది సేకరించి సంరక్షణ కేంద్రాల్లో పొదిగించి పిల్లలను సముద్రంలోకి వదిలి వదిలిపెడతారని జిల్లా అటవీశాఖ అధికారి భీమయ్య వెల్లడించారు.
''సూర్యలంక నుంచి నిజాంపట్నం తీరం వరకు సముద్రం ఒడ్డున వీటి కళేబరాలు కనిపిస్తున్నాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల కోసం సూర్యలంక, రామచంద్రపురం, రామాపురం, పొట్టి సుబ్బయ్య పాలెం కుంకుడు చెట్ల పాలెం, ఏటిమొగ,నిజాంపట్నంలో తాత్కాలిక సంరక్షణ కేంద్రాలను వెంటనే ప్రారంభిస్తాం. అవి చేపల వలలో చిక్కి చనిపోకుండా ఉండేలా మత్స్యకారులకు అవగాహన కల్పిస్తాం''- భీమయ్య, జిల్లా అటవీ శాఖ అధికారి