ప్రభుత్వ భూమిపై కన్నేసిన అధికార పార్టీ నాయకులు - కబ్జా చేసేందుకు యత్నం - Sri Sathya Sai District ycp leaders News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 20, 2023, 3:20 PM IST
Ruling Party Leaders Trying Possession at Govt Land: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు పార్టీ అండదండలతో ఎక్కడా ప్రభుత్వ భూమి కనిపించినా కబ్జా చేసేందుకు ముమ్మరంగా ప్రయత్నాలు చేసేస్తున్నారు. గుట్టాల్ని, లోయల్ని చదును చేసి, యథేచ్ఛగా ఆక్రమించేస్తున్నారు. తాజాగా ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి సమీపంలో ఉన్న గుట్టను హిటాచి సాయంతో చదును చేసి, భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తుండడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Locals Fire on Revenue Officials: శ్రీ సత్యసాయి జిల్లా కదిరి సమీపంలో ఉన్న గుట్టను హిటాచి సాయంతో కొంతమంది వైఎస్సార్సీపీ నేతలు చదును చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు అధికార పార్టీ నాయకులు యత్నిస్తున్నట్లు ఆరోపనలు వినిపిస్తున్నాయి. సర్వే నెంబరు 41లోని 19 ఎకరాల గుట్టలో ఐదు ఎకరాలను మురుగు నీరు శుద్ధి చేసే కర్మాగారానికి కేటాయించారు. మరో నాలుగు ఎకరాల భూమిని నలుగురు రైతులకు అసైన్డ్ పట్టాలు ఇచ్చారు. ఈ క్రమంలో విలువైన ప్రభుత్వ భూమిని చదును చేస్తున్నా, రెవెన్యూ అధికారులు అడ్డుకోకపోవడంపై స్థానికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తహశీల్దార్ దృష్టికి తీసుకెళ్లగా, ప్రభుత్వ భూమిని ఎవరికీ కేటాయించలేదని, ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో సునీత తెలిపారు.