పట్టపగలే బంగారం దుకాణంలో చోరీ - ఇద్దరు పరారీ, ఒకరిని పట్టుకున్న స్థానికులు - Gold Robbery in tirupati
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 31, 2023, 1:21 PM IST
Robbery in Gold Shop in Yerpedu: తిరుపతి జిల్లా ఏర్పేడులో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. డమ్మీ తుపాకి, కత్తులతో బెదిరించి చోరీకి పాల్పడ్డారు. అప్రమత్తమైన షాపు సిబ్బంది చాకచక్యంగా స్పందించడంతో ముఠాలో ఒకరు పట్టుబడ్డారు. మరో ఇద్దరు పరారయ్యారు. ఏర్పేడు సినిమా హాల్ వీధిలోని ఓ బంగారం దుకాణంలో ముగ్గురు వ్యక్తులు శనివారం సాయంత్రం దొంగతనానికి పాల్పడ్డారు. బంగారం దుకాణంలో యజమాని సుబ్రమణ్యం సోదరుడు, కూమారుడు ఉండగా గుర్తు తెలియని వ్యక్తులు డమ్మీ తుపాకి, కత్తులతో బెదిరించి నగదు, నగలు అపహరించారు. అనంతరం ద్విచక్ర వాహనంలో నిందితులు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా దుకాణదారుడు అక్కడే ఉన్న స్టూల్‌ను నిందితులపై విసిరాడు. దీంతో నిందితులలో ఒకరు అదుపుతప్పి ద్విచక్ర వాహనం నుంచి కింద పడటంతో స్థానికులు అతన్ని పట్టుకున్నారు. మిగిలిన ఇద్దరూ దొంగలు కొంత దూరం పరిగెత్తి రోడ్డుపై ఉన్న ఓ ద్విచక్ర వాహనాన్ని ఎత్తుకొని పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వారిపై కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. రేణిగుంటకు చెందిన విశ్వ, అతని స్నేహితులు కలిసి చోరీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎంత చోరీ జరిగిందో తెలుసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.