ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే సహించేది లేదు- సీఎంను మెప్పించేందుకు మాపై వత్తిడి తెస్తే ఎలా? పీఆర్ ఇంజినీర్లు
🎬 Watch Now: Feature Video
Panchayati Raj engineers allege against YCP government: ముఖ్యమంత్రి మెప్పు పొందేందుకు కొందరు అధికారులు నాలుగేళ్లలో చేయాల్సిన పనులను 4 నెలల్లో పూర్తి చేయాలని ఒత్తిడి చేస్తున్నారని పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి ఇంజనీర్లపై కలెక్టర్లు , ఉన్నతస్థాయి అధికారులు పరుష పదజాలం వాడుతున్నారని మండిపడ్డారు. తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తే సహించేది లేదని, రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
విజయవాడలో పంచాయతీరాజ్ ఇంజనీర్ల రాష్ట్రస్థాయి కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఆ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మురళీకృష్ణనాయుడు, సంగీతారావు తదితరులు హాజరయ్యారు. సమావేశం అనంతరం పంచాయతీరాజ్ ఇంజనీర్స్ నేతలు మీడియాతో మాట్లాడారు. గుత్తేదారులకు ప్రభుత్వం చెల్లింపులు చేయకుండా తమను బాధ్యుల్ని చేస్తుంన్నారని ఆరోపించారు. చెల్లింపులు రెగ్యులర్ గా జరిగితేనే పనులు చేయగలమని పంచాయతీరాజ్ ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడు మురళీకృష్ణ నాయుడు స్పష్టం చేశారు. 2019లో ప్రభుత్వం 12వేల కోట్ల విలువైన 40వేల భవనాలను ఒకేసారి మంజూరు చేసిందని వెల్లడించారు. తాము భవన నిర్మాణాలను దశలవారీగా చేపట్టాలని సూచించినా వినకుండా ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యం విధించిందని గుర్తుచేశారు. కరోనా మూలంగా రెండేళ్ల తర్వాత 2021 నుంచి ప్రారంభించి, ఇప్పటికి 50 శాతం పనులు పూర్తి చేశామని చెప్పారు. ఇప్పుడు నాలుగేళ్ల పనులను 4 నెలల్లో పూర్తి చేయాలని తమపై ఒత్తిడి చేస్తున్నారని ఆరోపించారు. కలెక్టర్ల చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పీఆర్ ఇంజనీర్ల సంఘ నేతలు స్పష్టం చేశారు.