NTR Indoor Stadium in Hindupuram: ఆడుదాం ఆంధ్రా పేరిట ప్రచార ఆర్భాటాలకే పరిమితమైన గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు యువతను క్రీడలకు దూరం చేసింది. నందమూరి తారక రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో హిందూపురంలో నిర్మించిన అతిపెద్ద ఇండోర్ స్టేడియానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కనీసం మరమ్మతులు చేయలేకపోయింది. గత ఐదేళ్లలో హిందూపురంలోని పాత స్టేడియాన్ని అభివృద్ధి చేయకపోగా కొత్త స్టేడియం నిర్మాణ పనులను నిలిపేసింది.
జిల్లాలోనే పెద్ద ఇండోర్ స్టేడియం: హిందూపురంలోని ఎంజీఎం రోడ్డులోని మైదానంలో అనంతపురం జిల్లాలోనే అత్యంత పెద్ద ఇండోర్ స్టేడియం నిర్మాణానికి 1986 జనవరిలో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భూమి పూజ చేశారు. స్టేడియం నిర్మాణం పూర్తయ్యాక 2001 డిసెంబర్‌లో ప్రారంభించారు. ఈ స్టేడియంలో షటిల్, బాడ్మింటన్ ఆటల్లో శిక్షణ పొంది వందలాది మంది యువత జాతీయస్థాయిలో రాణించి పతకాలు సాధించారు. ఇంతటి ప్రత్యేకత ఉన్న ఈ స్టేడియం స్వల్ప మరమ్మతులకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం పది లక్షలు కూడా ఇవ్వలేకపోయింది. దీంతో స్టేడియం శిథిలావస్థకు చేరి మందుబాబులకు అడ్డాగా మారింది. ఎన్టీఆర్ నిర్మించిన స్టేడియం శిథిలం కావడంపై తొలితరం క్రీడా కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గత టీడీపీ ప్రభుత్వం క్రీడాభివృద్ధి కోసం క్రీడా వికాస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా నూతన ఇండోర్ స్టేడియంలో నిర్మాణానికి నిధులు మంజారు చేసింది. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ స్టేడియం క్రీడాకారులకు సరిపోవడంలేదని అదే మైదానంలో కొత్తగా మరో స్టేడియం నిర్మాణానికి 2017లో చంద్రబాబు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కొత్తగా నిర్మించే స్టేడియంలో రెండు షటిల్ కోర్టులు, టేబుల్ టెన్నిస్ హాళ్లను అత్యాధునికంగా నిర్మించడానికి ప్రణాళిక సిద్ధం చేసింది. దీంతోపాటు స్టేడియం లోపలే క్రీడాకారుల కోసం ఆధునిక పరికరాలతో జిమ్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చింది.
శిథిలావస్థకు చేరిన కొత్త స్టేడియం: వీటన్నింటి కోసం 2 కోట్లను గతంలో టీడీపీ ప్రభుత్వం మంజూరు చేసింది. 2018లో పనులు ప్రారంభమవగా 2019 ఎన్నికల నాటికి 39 లక్షల విలువైన 45 శాతం పనులు పూర్తయ్యాయి. ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం స్టేడియం నిర్మిస్తే టీడీపీకి అక్కడి ఎమ్మెల్యే బాలకృష్ణకు మంచి పేరు వస్తుందని భావించి పనులు వెంటనే నిలిపివేయాలని ఆదేశించింది. అందువల్ల కొత్త స్టేడియం నిర్మాణం శిథిలావస్థకు చేరింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం యువతకు చేసిన ద్రోహం అంతా ఇంతా కాదని క్రీడాభిమానులు, విద్యార్థి సంఘం నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం హిందూపురంలో రెండు ప్రైవేట్ స్టేడియంలు ఏర్పాటు చేశారు. వీటిలో శిక్షణ కోసం ప్రతినెలా వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. దీంతో ఆర్థిక స్థోమతలేని పేద యువత శిక్షణ పొందలేక ఇబ్బందులు పడుతున్నారు. నిర్మాణంలో ఉన్న స్టేడియంను కూటమి ప్రభుత్వం సకాలంలో పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొస్తే ఉపయోగకరంగా ఉంటుందని హిందూపురం యువత విజ్ఞప్తి చేస్తున్నారు.
అభిమానికి ఊహించని గిఫ్ట్- కుటుంబంతో కలసి భోజనం చేసిన బాలయ్య - Balakrishna Lunch With his fan