Pamphlets Viral: తాడిపత్రిలో మరోసారి కరపత్రాల కలకలం.. ఈసారి వాటి గురించి..! - వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్ర
🎬 Watch Now: Feature Video
Pamphlets in Thadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో కరపత్రాలు మరోసారి కలకలం రేపాయి. వరుసగా బయటికి వస్తున్న కరపత్రాలు పట్టణంలో సంచలనం రేకెతిస్తున్నాయి. స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పాదయాత్రను ఉద్దేశించి ఈ కరపత్రాల్లో ముద్రించారు. "పెద్దారెడ్డి పాదయాత్ర - అనుచరుల మట్కా క్రికెట్ బెట్టింగ్ జాతర" అనే అంశాన్ని ముద్రించి నగరంలోని పలు వీధుల్లో గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను పడేశారు. దీంతో ఉదయం రోడ్డు పైకి వచ్చిన ప్రజలు కరపత్రాలను చదువుతున్నారు. ఈ మధ్య కాలంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి అవినీతి, అక్రమాలపైన గుర్తు తెలియని వ్యక్తులు కరపత్రాలను వేస్తున్నారు.
"పట్టపగలే మట్కా రాస్తున్న బీటర్లు.. భారీగా క్రికెట్ బెట్టింగ్, గంజాయి విక్రయాలు. పెరిగిన నేరాల సంఖ్య. పాత బుద్ధులు ఎక్కడికి పోతాయి. సారా ప్యాకెట్లు పంపిన నీచ చరిత్ర నీది" అంటూ కరపత్రాల్లో ముద్రించారు. వరుసగా బయటపడుతున్న ఈ కరపత్రాలను.. ఎవరు వేశారనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. కరపత్రాలు చదివిన ప్రజలు.. ఎమ్మెల్యే ఇన్ని అవినీతి, అక్రమాలు చేశారా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. కరపత్రాలతో అవినీతి భాగోతాలు బయటికి వస్తున్నాయని.. వాటిని చదవటానికి స్థానిక ప్రజలు ఆసక్తి చూపుతున్నారు.