Murder Attempt on Dalit Woman: దళిత మహిళపై దారుణ కీచకకాండ.. వివస్త్రను చేసి.. వీధుల్లో ఈడ్చుకెళ్లి.. - దళిత మహిళను వివస్త్రను చేసి వీధుల్లో ఈడ్చిన ఘటన
🎬 Watch Now: Feature Video
Murder Attempt on Dalit Woman: తెల్లారితే స్వాతంత్య్ర దిన సంబరాలు.. దేశం యావత్తు ఉత్సవాలకు సిద్ధమవుతుండగా.. ప్రకాశం జిల్లాలో ఓ అమానుష ఘటన చోటుచేసుకుంది. జిల్లాలోని దర్శి మండలం బొట్లపాలెంనకు చెందిన ఓ దళిత వితంతు మహిళపై దారుణమైన రీతిలో హత్యాయత్నం జరిగింది. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతడి భార్య.. ఆమెను నిర్బంధించి సజీవ దహనానికి ప్రయత్నించారు. దీనికి సంబంధించిన వివరాలను డీఎస్పీ అశోక్ వర్ధన్ తెలిపారు. సోమవారం అర్ధరాత్రి సమయంలో బాధితురాలు, ఆమె తల్లి.. కుళాయి వద్ద నీరు పట్టుకుంటుండగా అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి, అతని భార్య పుల్లమ్మ.. వారి ముఖంపై కారం చల్లి కత్తులతో దాడి చేశారు. ఆ సమయంలో బాధితురాలి తల్లి తప్పించుకోగా.. ఆమె వారి చేతికి చిక్కడంతో దారుణంగా దాడి చేసి.. కళ్లలో కారం కొట్టి.. కత్తులతో విరుచుకుపడి.. క్రూరంగా హింసించారు.
అంతటితో ఆగకుండా ఆమెను వీధిలోకి ఈడ్చుకుంటూ లాక్కెళ్లి వివస్త్రను చేయటంతో పాటు తాళ్లతో కాళ్లు, చేతులు కట్టి గొడ్డలి వెనక పిడితో తీవ్రంగా కొట్టారు. అయినా వారి ఆగ్రహం చల్లారలేదు.. ఆమె ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనపై స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి ఆమెను విడిపించి.. తీవ్ర గాయాలపాలైన మౌనికను ఆసుపత్రికి తరలించారు. అయితే.. గతంలో బాధితురాలి సోదరుడు సాయిరాం.. అదే గ్రామానికి చెందిన బ్రహ్మారెడ్డి కుమార్తె భార్గవి ప్రేమించుకున్నారు. ఇద్దరూ మేజర్లు కావడంతో కులాంతర వివాహం చేసుకొని.. పెద్దల నుంచి తమకు రక్షణ కల్పించాలంటూ మార్చి 2న జిల్లా ఎస్పీని కలిశారు. తరువాత ఇరువురి తల్లిదండ్రులను పిలిపించిన పోలీసులు.. గొడవలుపడొద్దంటూ తెలిపారు. అనంతరం మార్చి 15వ తేదీన సాయిరాం ఇంట్లో ప్రవేశించి అతని కుటుంబ సభ్యులపై బ్రహ్మారెడ్డి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో వారిపై కేసులు నమోదు కాగా.. వారికి కొద్ది రోజుల్లో బెయిల్ రావటంతో నిందితులు మరోసారి దాడికి పాల్పడ్డారు.