Manda Krishna Madiga Comments: 'జగన్ ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు రక్షణ లేదు' - వైసీపీ ప్రభుత్వంపై మంద క్రిష్ణ ఫైర్
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/17-06-2023/640-480-18775008-849-18775008-1686985703253.jpg)
Manda Krishna Madiga Comments: వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో దళితులపై దాడులు రోజువారీ తంతుగా మారాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. గుంటూరు జిల్లా.. కొల్లిపర మండలం పిడపర్రు గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకుల దాడిలో గాయపడ్డ దళిత నాయకుడు మోహన్‌ను ఆయన పరామర్శించారు. అతనికి అండగా ఉంటామని దైర్యం చెప్పారు. వల్లభాపురం గ్రామం నుంచి పిడపర్రు గ్రామం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేమూరి మోహన్ని అధికార పార్టీ నేత అరుణ్ కుమార్ రెడ్డి కులం పేరుతో ధూషించడమే కాకుండా అతనిపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
బాధితుడు దళితుడు కాబట్టి పోలీసులు నిందితుడికి కొమ్ముకాస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ కేసు నుంచి అతని కాపాడేందుకు వారు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. జగన్ ప్రభుత్వంలో దళితుల ప్రాణాలకు, ఆత్మగౌరవానికి రక్షణ లేదని మందకృష్ణ మాదిగ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌ను నీరుగారుస్తోందని.. దళితుల ప్రాణాలు పోయేలా చేస్తోందని దుయ్యబట్టారు. దళితుల ఆవేదన ఆగ్రహంగా మారితే జగన్ ప్రభుత్వానికే నష్టమని మందకృష్ట హెచ్చరించారు.