పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారు, ప్రస్తుతం ఉన్నవన్నీ చంద్రబాబు మంజూరు చేసినవే: మంత్రి పెద్దిరెడ్డి - Minister Peddireddy comments on liquor
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 5, 2023, 10:46 PM IST
Minister Peddireddy Ramachandra Reddy Comments On Purandeswari: గత కొద్ది రోజులుగా ఏపీలో మద్యం పాలసీ గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి ఆరోపణలు గుప్పిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ఏ కంపెనీలు మద్యం తయారు చేస్తున్నాయో వివరాలను బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నారు. అదే విధంగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ వద్ద 100 కంపెనీలు నమోదైతే.. అందులో 74 శాతం మద్యం సరఫరాను కేవలం 16 కంపెనీలే సప్లై చేస్తున్నాయని ఆరోపిస్తున్నారు. అయితే దీనిపై ప్రభుత్వం స్పందించాలని ఆమె కోరారు. తాజాగా దీనిపై మంత్రి పెద్దిరెడ్డి స్పందించారు.
మద్యం డిస్టలరీల విషయంలో బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి అవాస్తవాలు మాట్లాడుతున్నారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. విజయవాడలో పర్యటించిన మంత్రి పెద్దిరెడ్డి.. పురందేశ్వరి వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. చంద్రబాబుకు వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ప్రస్తుతమున్న డిస్టలరీలన్నీ చంద్రబాబు మంజూరు చేసినవేనని చెప్పారు. జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఏ ఒక్క డిస్టలరీని మంజూరు చేయలేదని చెప్పారు. పురందేశ్వరి ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు.