తిరువూరులో కేశినేని నాని Vs చిన్నీ - ఇరువర్గాల బాహాబాహీ - about Kesineni brothers
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 3, 2024, 8:56 PM IST
Kesineni Brothers Followers Fight at TDP Meeting: ఎన్టీఆర్ జిల్లా తిరువూరు తెలుగుదేశం విసృత స్ధాయి సమావేశం రసాభాసాగా మారింది. ఫ్లెక్సీల విషయంలో కేశినేని నాని - కేశినేని చిన్ని వర్గీయులు బాహాబాహీకి దిగారు. ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. పార్టీలోని రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడి చేసుకున్నారు. ఇరు వర్గాలను అదుపు చేసే క్రమంలో తిరువూరు పట్టణ ఎస్ఐ సతీష్‌కు గాయాలయ్యాయి. కుర్చీల విసురులాటలో ఎస్ఐకి తగలడంతో ఆయన తలకు గాయమైంది. వెంటనే పోలీసు సిబ్బంది ఎస్ఐని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది.
ఇరువర్గాల గొడవలపై టీడీపీ పెద్దలు సీరియస్ అయినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పోలీసులు అల్లర్లకు కారణం అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. గత కొంత కాలంగా కేశినేని బ్రదర్స్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీలో ఆదిపత్యపోరు పెరుగుతోంది. ఒక్కరిపై ఒక్కరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే కేశినేని నాని - కేశినేని, చిన్ని వర్గీయులు దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
స్పందించిన కేశినేని సోదరులు: దాడి ఘటనపై కేశినేని బ్రదర్స్ స్పందించారు. సమన్వయ కమిటీలోని లోపాల వల్లే తిరువూరు తెలుగుదేశంలో అలజడి నెలకొందని కేశినేని నాని తెలిపారు. తిరువూరు ఇన్చార్జిగా ఉన్న వ్యక్తికి రాజకీయం తెలియక ఈ రాద్ధాంతమంతా జరిగిందన్నారు. నన్ను కొంతమంది విమర్శించినా తగ్గి ఉన్నానన్నారు. 7వ తేదీన తిరువూరులో జరిగే చంద్రబాబు బహిరంగ సభ బాధ్యత తనదేనని కేశినేని నాని స్పష్టం చేశారు.
తిరువూరులో జరిగిన ఘటన దురదృష్టకరమని కేశినేని చిన్నీ తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకుంటానని తిరువూరు ప్రజలకు హామీ ఇచ్చారు. ఇవాళ ఘటనపై ప్రజలకు క్షమాపణ చెబుతున్నట్లు తెలిపారు. తిరువూరు ఘటనను అధిష్టానం చూసుకుంటుందన్న చిన్నీ, 7వ తేదీ జరిగే చంద్రబాబు సభను విజయవంతం చేయాలని కోరారు.