Ward member begging for road గ్రామంలో రోడ్డు కోసం భిక్షాటన చేసిన వార్డు మెంబర్.. వీడియో వైరల్ - Ward member begging for road
🎬 Watch Now: Feature Video
Janasena ward member begging for village road: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంత జిల్లా అయిన వైయస్సార్ జిల్లాలో.. పలు గ్రామాలకు సరైన రోడ్లు, వీధిలైట్లు, మురుగు కాల్వలు లేక ప్రజలు, బడి పిల్లలు నానా అవస్థలు పడుతున్నారు. దీంతో ఆయా గ్రామాలకు చెందిన సర్పంచులు, వార్డు మెంబర్లు రోడ్లు వేయాలంటూ పలుమార్లు ఎమ్మెల్యేలకు, అధికారులకు వినతులు అందజేసినా పట్టించుకోలేదు. ఈ క్రమంలో సర్పంచులు, వార్డు మెంబర్లు నిరసనలకు, ధర్నాలకు దిగుతున్నారు. తాజాగా బ్రహ్మంగారిమఠం మండలం బసవాపురం గ్రామానికి తక్షణమే రోడ్డు వేయాలంటూ.. జనసేన పార్టీకి చెందిన 15వ వార్డు మెంబర్ రాజేశ్ వినూత్నంగా నిరసన తెలిపారు. గ్రామానికి వచ్చే రహదారి ముందు కుర్చోని.. వెంటనే తమ గ్రామానికి సిమెంట్ రోడ్డును నిర్మించాలంటూ భిక్షాటన చేపట్టారు.
వార్డు ప్రజలారా నన్ను క్షమించండి.. వార్డు మెంబర్ రాజేశ్ మీడియాతో మాట్లాడుతూ..''మా గ్రామానికి సరైన రోడ్డు లేదు. ఈ విషయం గురించి గతంలో అనేకసార్లు ఎమ్మెల్యేకు, అధికారులకు విన్నవించినా పట్టించుకోలేదు. నన్ను ఓట్లువేసి గెలిపించినా నా వార్డు ప్రజలకు.. కనీసం వీధిలైట్లు, మురుగు కాల్వలు కూడా నిర్మించలేకపోయాను. అందుకు ప్రజలందరికీ క్షమాపణలు చెప్తున్నా. మట్టి రోడ్డుతో ఉన్న మా గ్రామానికి వెళ్లాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాము. గత్యంతరం లేక రోడ్డు కోసం భిక్షాటన చేస్తున్నాను. జగన్ పాలనలో మా ఊరికి మంచి చేయలేని ఓ అసమర్ధ వార్డు మెంబర్‌గా పేరు తెచ్చుకున్నాను.'' అని ఆయన అన్నారు. మరోవైపు పది నెలల కిందట ఇదే రహదారి కోసం వార్డ్ మెంబర్ రాజేష్.. బురదలో పొర్లుతూ దండాలు పెడుతూ నిరసన తెలియజేశారు. దాంతో స్పందించిన అధికారులు, నాయకులు.. అప్పట్లో గ్రామానికి రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కానీ, ఇంతవరకూ ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో మరోసారి భిక్షాటన చేస్తూ నిరసనకు దిగారు.