Father Commits Suicide after Daughter Husband Harasses Her: లక్షల్లో కట్నమిచ్చి కుమార్తె పెళ్లి చేశాడు. భర్త, పిల్లలతో కుమార్తె సంతోషం ఉంటుందని భావించాడు. కానీ అతని ఆశ నెరవేరలేదు. కొన్ని రోజులకే కుమార్తె పుట్టింటికి చేరింది. దంపతుల మధ్య చిన్నచిన్న గొడవలు సర్దుకుంటాయని అనుకున్నాడు. కానీ అవి మరింత ముదిరిపోయాయి. పుట్టింటికి భార్యను పంపిన అల్లుడు ఏడాదైనా తీసుకెళ్లలేదు. దీంతో ఆ తండ్రి మనస్థాపం చెందాడు. బిడ్డ సంసారాన్ని ఎలా చక్కదిద్దాలో తెలియక, ఏం చేయాలో అర్ధంగాక తన జీవితాన్ని ముగించాడు. ఈ విషాద ఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
సాఫీగా సాగిన కాపురంలో విభేదాలు: బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జిల్లాలోని భీమిలి మండలం గొల్లలపాలెం గ్రామానికి చెందిన బొట్ట శ్రీనివాసురావు (59) భార్యా పిల్లలతో జీవిస్తున్నారు. కుమార్తె యామిని (23)ని జీవీఎంసీ 2వ వార్డు సంగివలస గ్రామానికి చెందిన అక్కరమాని చంద్రశేఖర్(27)కు ఇచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించారు. కొంతకాలం సాఫీగా సాగిన కాపురంలో అప్పుడప్పుడు భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో భర్త, అత్తమామలపై భీమిలి పోలీస్ స్టేషన్, దిశ స్టేషన్లో యామిని ఫిర్యాదు చేశారు.
ఫిర్యాదుపై విచారణ చేసి సీఐ కేసు నమోదు చేశారు. అనంతరం పెద్దల సమక్షంలో చంద్రశేఖర్‌ను మందలించి యామినిని కాపురానికి పంపించారు. మళ్లీ ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో యామని పురుగుల మందు త్రాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స అనంతరం యామిని తన బిడ్డతో పాటు పుట్టింటికి చేరుకున్నారు.
లేఖ రాసి ఆత్మహత్య: యామిని పుట్టింటికి వచ్చి ఏడాదవుతున్నా కాపురానికి తీసుకు వెళ్లలేదని తండ్రి మనస్థాపం చెందారు. దీనికి తోడు కుమార్తెకు మనవడిని కూడా దూరం చేయడంతో మరింత కృంగిపోయారు. ఇంట్లో ఉన్న కూతురుని చూసి తండ్రి తరచూ బాధపడేవారు. చంద్రశేఖర్‌కు రాజకీయ పలుకుబడి, ధన బలం వండటం వల్లే కూతురికి న్యాయం జరగలేదని భావించిన శ్రీనివాసరావు తన సొంత ఊరైన నెల్లూరు వెళ్లి లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. కుమార్తె కాపురాన్ని చెడగొట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, స్థానిక ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కూడా చొరవ తీసుకుని శిక్ష పడే విధంగా చూడాలని లేఖలో పేర్కొన్నారు.
నెల్లూరు నుంచి మృతదేహాన్ని టీ నగరపాలెం గ్రామానికి బంధువులు తీసుకొచ్చారు. శ్రీనివాసరావు మృతదేహం ముందు స్థానికులు ఆందోళన చేశారు. మనవడిని కుమార్తెకు అప్పగించాలని బంధువులు డిమాండ్ చేశారు. తీసుకొచ్చే వరకు మృతదేహాన్ని శ్మశాన వాటికకు తరలించేది లేదని ఖరాఖండిగా తెలిపారు. ఘటనా స్థలానికి సీఐ సుధాకర్, ఎస్ఐ హరీష్ చేరుకుని ఇరు వర్గాలతో మాట్లాడారు. అయినప్పటికీ మిత్రులు బంధువులు శాంతించలేదు. మృతదేహంతో టీ నగరప్పాలెం రహదారి మీదే బైఠాయించారు.
EMI చెల్లించలేదని న్యూడ్ ఫొటోలు - పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు