Government Steps Towards Interlinking of Rivers in State : రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తోంది. గోదావరి, వంశధార నదుల వరద జలాలను అటు రాయలసీమ, ఇటు ఉత్తరాంధ్ర, మధ్యాంధ్రలోని కరవు ప్రాంతాలైన ఉమ్మడి గుంటూరు, ప్రకాశం జిల్లాలకు ఉపయోగించుకోవాలనేది ప్రధాన ఉద్దేశం. గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేపట్టిన కొన్ని అనుసంధాన పథకాలను ఇప్పటికే గట్టెక్కించేలా అడుగులు పడుతున్నాయి. దీనికి తోడు గోదావరి వరద జలాలను తరలించి బొల్లాపల్లి జలాశయంలో నిల్వ చేసి అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్‌కు తరలించాలనే పెద్ద ప్రాజెక్టును ఇప్పుడు చేపట్టకపోతే ఎప్పటికీ చేపట్టలేమని ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టుదలగా ఉన్నారు.
అందుకు అనుగుణంగా గతంలో వ్యాప్కోస్ ఇచ్చిన ప్రతిపాదనలకు తాజా మార్పులను జోడించి మెరుగులు దిద్దుతున్నారు. దాదాపు రూ.80 వేల కోట్లకు పైగా అయ్యే ఈ ప్రాజెక్టుకు నిధులను ప్రైవేటుగా సమీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఈ నేపథ్యంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధాన ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని తాజాగా రాష్ట్ర ప్రభుత్వం జాతీయ జల అభివృద్ధి సంస్థకూ లేఖ రాసింది.
పెన్నాతో తొలిదశ అనుసంధానానికి అందుబాటులో నిధులు : గోదావరి వరద జలాలను (73 టీఎంసీలను) మళ్లించి సాగర్ కుడి కాలువ ఆయకట్టు 9.61 లక్షల ఎకరాలను స్థిరీకరించాలన్నది ప్రధాన ఉద్దేశం. మొదటి ప్యాకేజీలో రూ.465 కోట్ల పని పూర్తయింది. ఇందులో ప్రకాశం బ్యారేజీ ఎగువన మూడు పంపుహౌస్‌లు నిర్మించడంతో పాటు ఆరు వరుసల్లో 4.57 కిలోమీటర్ల మేర పైపులు ఏర్పాటు చేసి నీళ్లు మళ్లించడం ఉద్దేశం. అక్కడి నుంచి 40 కిలోమీటర్లకు పైగా కాలువ తవ్వాల్సి ఉంది. మూడు సబ్ స్టేషన్లు నిర్మించాలి. ఈ ప్యాకేజీలో ఇంకా రూ 1,815.39 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది.
రెండో ప్యాకేజీలో భాగంగా రెండు పంపు హౌస్‌లు నిర్మించాలి. 5.65 కిలోమీటర్ల మేర ఆరు వరుసల పైపులు ఏర్పాటు చేయాలి. మరో 15.95 కిలోమీటర్ల మేర కాలువ తవ్వకం పనులు చేయాల్సి ఉంది. రెండు సబ్‌స్టేషన్లను నిర్మించాలి. ఇందులో రూ.550 కోట్ల విలువైన పని చేశారు. మరో 2,105.82 కోట్ల విలువైన పని చేయాల్సి ఉంది. 3,437 ఎకరాల భూమిని సేకరించాలి. ఇందుకు రూ.1,044 కోట్లు అవసరం. తొలిదశలో 466 ఎకరాల భూమిని సేకరిస్తారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి గత ప్రభుత్వం గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ ద్వారా రూ.2,746 కోట్ల రుణం తీసుకుంది.
ఇందులో రూ.1,453 కోట్లను ఆ కార్పొరేషన్ విడుదల చేసింది. పనులపై రూ.1,015.96 కోట్లు ఖర్చు చేశారు. ప్రస్తుతం జలవనరుల కార్పొరేషన్ వద్ద రూ.437 కోట్లు అందుబాటులో ఉన్నాయని అధికారులు గుర్తించారు. గ్రామీణ విద్యుదీకరణ కార్పొరేషన్ నుంచి మరో రూ.1,293 కోట్లు రావాల్సి ఉంది. ప్రస్తుత పనులకు ఆ నిధులు వినియోగించుకోవచ్చని జలవనరులశాఖ అభిప్రాయపడుతోంది. అందుకు అనుగుణంగా పనుల వేగం పెంచనున్నారు.
వ్యాప్కోస్‌తో అధ్యయనం : వ్యాప్కోస్ గోదావరి వరద జలాలు బనకచర్లకు తీసుకువెళ్లే అంశంపై అధ్యయనం చేస్తోంది. ఇప్పటికే లైడార్ సర్వే కూడా పూర్తి చేసి ప్రాజెక్టు నివేదిక వివిధ ప్రతిపాదనలు సిద్ధం చేశారు. తాజా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం కొన్ని మార్పులను సూచించింది. పోలవరం కుడి కాలువ వెడల్పు చేయడం, లేదా సమాంతర కాలువ నిర్మాణం అన్న అంశంతో పాటు బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్లకు నీళ్లు మళ్లించే సులభ మార్గాలపై వ్యాప్కోస్ అధ్యయనం చేస్తోంది. జలవనరులశాఖ ఉన్నతాధికారులు వారితో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే కొలిక్కి తీసుకువచ్చి ముఖ్యమంత్రి వద్ద భేటీకి ఏర్పాట్లు చేస్తున్నారు.
రైతులకు నీళ్లు సకాలంలో ఇస్తే బంగారం పండిస్తారు: సీఎం చంద్రబాబు - CM CBN Somasila Reservoir Visit
వంశధార నాగావళి అనుసంధానంలో : వంశధార నది వరద జలాలు ప్రతి ఏటా సముద్రంలో కలిసిపోతున్నాయి. ఆ నీటిని నాగావళి నదికి నారాయణపురం ఆనకట్ట వద్ద అనుసంధానించాలనే ఉద్దేశంతో పనులు ఎప్పుడో చేపట్టారు. జగన్ ప్రభుత్వ హయాంలో పనులు వేగంగా చేయకపోవడంతో ఈ ప్రాజెక్టు పూర్తి కాలేదు. హిర మండలం జలాశయం నుంచి నారాయణపూర్ ఆనకట్టకు కాలువ తవ్వి ఈ నీళ్లు మళ్లిస్తారు. నారాయణపురం ఆనకట్ట కింద 37,053 ఎకరాలు ఉంది.
ఈ అనుసంధానంతో 28,527 ఎకరాల స్థిరీకరణ సాధ్యమవుతుంది. కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టును రూ.145 కోట్లతో చేపట్టారు. స్థానిక ప్రజాప్రతినిధులు అదనపు పనులు కోరుతున్నారు. కొన్ని కొత్త వంతెనలను ప్రతిపాదిస్తున్నారు. దీనికి తోడు కాలువ చివర్లో కొంత భూమి ముంపులో చిక్కుకుంటుందని, అందువల్ల అక్కడ కొత్త కట్టడాలు నిర్మించి ఆ ముంపును నిరోధించాలని కోరుతున్నారు. ఇందుకు అనుగుణంగా అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. అలాగే భూసేకరణ పూర్తికాలేదు. పరిష్కారం కోసం సంబంధిత వ్యక్తులను సంప్రదిస్తున్నారు.
పామర్రులో ఐటీ టవర్-రైతు కూలీల కోసం ప్రత్యేక కార్పొరేషన్: చంద్రబాబు - CHANDRABABU PRAJA GALAM MEETING