సాగర తీరంలో సీఆర్జెడ్ నిబంధనలను విరుద్దంగా అక్రమ నిర్మాణాలు - పీతల మూర్తి యాదవ్ ఆరోపణలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 21, 2023, 10:46 PM IST
Jana Sena leader Murthy Yadav on illegal constructions in Visakha: విశాఖ సాగర తీరంలో సీఆర్జెడ్ నిబంధనలను విరుద్దంగా కార్తీకవనం ప్రాజెక్టు పేరిట రాడిసన్ బ్లూ హోటల్ నిర్మాణ పనులు జరుగుతున్నా.. గుత్తేదారుపై చర్యలు తీసుకోకుండా వీయంఆర్డీ… చోద్యం చూస్తోందని జనసేన పార్టీ కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నిబంధనలకు విరుద్దంగా ఉన్న ఈ ప్రాజెక్టులో ఉన్న నిర్మాణాలపై తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. నిర్మాణ విషయంలో కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి పొందిన అనుమతులను తుంగలో తొక్కిందని పేర్కొన్నారు.
జనసేన పార్టీ తరఫున కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి రాష్ట్ర బాధ్యులకు, జిల్లా కలెక్టర్ వరకు ఉన్న అధికారులందరికీ ఇందులో జరిగిన ఉల్లంఘనలను వివరిస్తూ మూర్తి యాదవ్ లేఖ రాశారు. నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్న నిర్మాణాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ లేఖకు సంబంధించిన వివరాలు మీడియాకి వివరించిన ఆయన... అవసరమైతే ఈ అంశంపై న్యాయస్ధానాలను కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. టూరిజం పేరిట వైసీపీ ప్రభుత్వం విశాఖ తీర ప్రాంత భూములను దోచుకుంటోందని మూర్తి యాదవ్ దుయ్యబట్టారు.