High Court on Tiger Nageswara Rao Movie: టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాతకు ఏపీ హైకోర్టు నోటీసులు.. టీజర్‌పై అభ్యంతరాలు - Tiger Nageswara Rao teaser controversy
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Aug 31, 2023, 11:21 AM IST
High Court on Tiger Nageswara Rao Movie : 'టైగర్ నాగేశ్వరావు' సినిమా టీజర్‌లో వాడిన పద ప్రయోగం ఓ సామాజిక వర్గాన్ని, స్టువర్టుపురం ప్రాంత వాసులను అవమానించేదిగా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ లేకుండా టీజర్ ఎలా విడుదల చేస్తారని అభ్యంతరం తెలిపింది. డబ్బు సంపాదించడమే లక్ష్యంగా సినిమాల నిర్మాణం ఉండకూడదని హితవుపలికింది. సమాజంపై బాధ్యతగా ఉండొద్దా అని సినీ నిర్మాణ సంస్థను ఉద్దేశించి ఘాటుగా వ్యాఖ్యానించింది. టీజర్ ద్వారా సమాజానికి ఏమి సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించింది. చిత్ర నిర్మాత అభిషేక్ అగర్వాల్‌కు నోటీసులు జారీ (High Court Notice to Producer Abhishek Agarwal) చేసింది. మరో వైపు ముంబాయిలోని సెంట్రల్ బోర్డు ఫిల్మ్ సర్టిఫికేషన్ ఛైర్‌పర్సన్‌ను వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌కు సూచించింది. అభ్యంతరాలపై ఛైర్‌పర్సన్‌కు ఫిర్యాదు చేసుకునేందుకు పిటిషనర్‌కు వెసులుబాటు ఇచ్చింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ ఏవీ శేషసాయితో కూడిన ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. టైగర్ నాగేశ్వరావు సినిమా ఎరుకుల సామాజికవర్గం మనోభావాలను కించపరిచేదిగా ఉందని, స్టువర్టుపురం గ్రామప్రజల ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఉందని పేర్కొంటూ చుక్కా పాల్‌రాజ్ హైకోర్టులో పిల్ వేశారు.