భారీ వర్షంతో నెల్లూరు జలమయం - మళ్లీ వాతావరణ శాఖ హెచ్చరిక - బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం హెచ్చరిక
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 1, 2023, 12:09 PM IST
Heavy Heavy Rains in Nellore : బంగాళాఖాతంలో అల్పపీడనం (Low Pressure in Bay of Bengal) కారణంగా నెల్లూరులో రెండు రోజులు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. ఈ వర్షానికి నగర వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద నీటితో రోడ్లు, మురుగు కాలువలు చెరువులను తలపించాయి. మురు కాలువల్లో పూడికలు నిండుకోవడంతో అడుగు ఎత్తులో వర్షపు నీరు ప్రవహించింది. అండర్ బ్రిడ్జిల వద్ద నీరు చేరి వాహనదారులు, పాదచారులు అవస్థలు పడ్డారు. మరో నాలుగు నుంచి ఆరు రోజులు పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ తెలపడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.
Rain Alert to AP : రాష్ట్రంలో భారీ వర్షాలు పడే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగండంగా మారి.. తుపానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి వాయుగుండంగా మారి.. శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుపానుగా మారనున్నట్లు తెలిపింది. కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. రైతులు, మత్స్యకారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.