ఎర్రచందనం విక్రయానికి ప్రభుత్వం అనుమతి - ధర నిర్ధరణకు కమిటీ - e auction
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 16, 2024, 5:22 PM IST
Red Sandalwood Sale : విదేశాల్లో ఎర్రచందనం దుంగల విక్రయానికి ప్రభుత్వం అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు గ్రేడింగ్ చేసిన 381.377 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం ఇ- ఆక్షన్, గ్లోబల్ టెండర్ల ద్వారా విక్రయించేందుకు ధర నిర్ధరణ కమిటీని కూడా ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇ-టెండర్ కమ్ ఇ-ఆక్షన్ ద్వారా 29 విడత ఎర్రచందనం విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మెట్రిక్ టన్ను ఎర్రచందనాన్ని ఎంత ధరకు విక్రయించాలన్న అంశంపై నిర్ధారణ కోసం అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చైర్మన్ గా, అటవీశాఖ ముఖ్యసంరక్షణాధికారి, అటవీ అభివృద్ధి సంస్థ వీసీఎండీ, ఎపీఎప్ఢీసీ సీజీఎం సభ్యులుగా కమిటీని నియమించారు. అంతర్జాతీయంగా వేలంలో విక్రయించాల్సిన ఎర్రచందనం ధరను నిర్ధారించాల్సిందిగా ప్రభుత్వం కమిటీకి సూచనలు జారీ చేసింది. గతంలో 5376 మెట్రిక్ టన్నుల ఎర్రచందనం దుంగలను దశలవారీగా విక్రయించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏపీ ఆటవీ అభివృద్ధి కార్పోరేషన్ వీసీఎండీ సిఫార్సుల మేరకు గ్లోబల్ టెండర్ల ద్వారా ఇ-ఆక్షన్ ను సమన్వయం చేసేందుకు మరో కమిటీని నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.