Godavari floods: కోనసీమ లంక గ్రామాలను చుట్టుముట్టిన గోదావరి.. జలదిగ్బంధంలో లోతట్టు ప్రాంతాలు
🎬 Watch Now: Feature Video
Konaseema Lanka villages in flood: ఉగ్ర గోదావరి దాటికి లంక గ్రామాలు విలవిలలాడుతున్నాయి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల్ని వరద నీరు చుట్టుముట్టేసింది. కోనసీమలోని దాదాపు 30గ్రామాలకు.. బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల్లో రహదారుల పైనుంచి వరద నీరు పొంగి పొర్లుతోంది. గ్రామాల్లోని రహదారులను వరద ముంచేయడంతో గ్రామస్థులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. లంకవాసులు.. మర, నాటు పడవలు, ట్రాక్టర్లలో రాకపోకలు సాగిస్తున్నారు. పి.గన్నవరం మండలంలోని బూరుగుల్లంక, జి.పెదపూడి లంక, అరిగిలవారి పేటలకు వెళ్లేందుకు ఏటిగట్టు నుంచి పడవల్లో వెళ్లి కొద్ది దూరం నడచి.. అక్కడి నుంచి వశిష్ఠ గోదావరి పాయ వరద ఉధృతిలో ప్రయాణించి వారు ఒడ్డుకు చేరుతున్నారు. వెదురుబీడెం కాజ్ వేపై.. భారీగా వరద చేరింది. అయినివిల్లి లంకల వాసులు.. నాటు పడవల్లోనే ప్రయాణిస్తున్నారు. తొత్తరమూడి, పెదలంక, వీరవల్లిపాలెం కొత్త కాలనీలోకి నీరు చేరింది. వేల ఎకరాల పంటలు నీటమునిగాయి. లక్షల పెట్టుబడులు వరదార్పణవ్వడంతో రైతులు దిగాలు చెందుతున్నారు.