Gas cylinder blast: పేలిన గ్యాస్ సిలిండర్.. ఎగిరిపోయిన ఇంటి పైకప్పు.. నలుగురికి తీవ్ర గాయాలు - Accident news
🎬 Watch Now: Feature Video
Gas cylinder explosion: ఇంట్లో వంట గ్యాస్ సిలెండర్ పేలి నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడిన ఘటన అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటాంపల్లి పెద్ద తాండలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం వెంకటాంపల్లి పెద్ద తాండలో రమావత్ సరోజమ్మ ఇంట్లో గ్యాస్ పొయ్యికి ఉన్న సిలెండరు ఖాళీ అవడంతో దాని స్థానంలో.. మరో సిలిండరును మార్చడానికని వారి ఎదురింటికి చెందిన సభావత్ సరోజమ్మ సాయం తీసుకున్నారు. వీరంతా కలసి సిలెండరును పొయ్యికి అమర్చడానికి ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. మంటలను అదుపు చేస్తుండగానే సిలిండరు పేలిపోయింది. ఈ పేలుడు ధాటికి ఇంటి పైకప్పు సైతం ఎగిరిపోయింది. ఈ ప్రమాదంలో వారిద్దరితోపాటు ఆరు నెలల కిందట పెళ్లయిన మాధవి ఎదురింటికీ చెందిన దేవమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో మొత్తం నలుగురు మహిళలు తీవ్రంగా గాయపడగా.. వారిని ఉరవకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో రమావత్ సరోజమ్మ, దేవమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో వారందరిని అనంతపురం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద వివరాలను ఉరవకొండ సీఐ శేఖర్ ఆసుపత్రిలో సేకరించారు. అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకొని వివరాలను ఆరా తీశారు. విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆసుపత్రికి చేరుకుని బాధితులకు ధైర్యం చెప్పారు.
ఉలిక్కి పడిన గ్రామం.. చిరుజల్లులు పడుతుండగా చల్లని వాతావరణంలో వెంకటం పల్లి పెద్దతండా గ్రామంలో నిశ్శబ్దంగా ఉంది. ఈ క్రమంలో ఒక్కసారిగా సిలిండరు పేలిన శబ్దానికి గ్రామం ఉలిక్కిపడింది. పై కప్పు ఎగిరిపోవడంతో శిథిలాల ఇరుపొరుగు ఇళ్లమీద పడడంతో ఏమి జరిగిందోనని గ్రామస్తులు ఆందోళనకు గురయ్యారు. ఆ సమయంలో పరిసరాలలో జనాలు పెద్దగా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.