Ethipothala Waterfalls: జలకళతో ఎత్తిపోతల పరవళ్లు.. చూసేందుకు తరలివస్తున్న పర్యాటకులు - నాగార్జున సాగర్ సమీపంలోని ఎత్తిపోతల జలపాతం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Sep 3, 2023, 8:49 PM IST
Ethipothala Waterfalls: ఎత్తైన కొండలు.. దట్టమైన అడవులు.. పాల నురగల జలపాతాలు.. ఆహా ఎంత బాగుందో కదా ఆ ఊహ. వర్షాలు వస్తే పోటెత్తే జలపాతాల అందాలను అలా చూస్తుంటే అలా ఎంత సమయమైనా అక్కడే ఉండిపోవాలి అనిపిస్తుంది కదా. ఎవరైనా సరే ఇట్టే ఆ జలపాతాల అందాలతో ప్రేమలో పడిపోతారు. అటువంటి జలపాతాలు ప్రకృతి ప్రేమికుల్ని మరెంతగానో కట్టిపడేస్తాయి. ఆ అందాలు ఇప్పుడు ఎక్కడో కాకుండా మన రాష్ట్రంలోనే దర్శనమిస్తున్నాయి.
ఎగువ ప్రాంతాలలో భారీగా కురుస్తున్న వర్షాలకు జలపాతాలు పొంగి పొర్లుతున్నాయి. పల్నాడు జిల్లాలోని మాచర్ల మండలంలో గత రాత్రి కురిసిన భారీ వర్షానికి పర్యాటక ప్రాంతమైన ఎత్తిపోతల జలపాతం వరద నీటితో జలకళను సంతరించుకుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షం పడటంతో ఎత్తిపోతలకు వాగులు, అటవీ మార్గాల ద్వారా వరద వచ్చి చేరుతుంది. దీంతో 70 అడుగుల ఎత్తు నుంచి నీరు కిందకు ప్రవహిస్తోంది. ఎత్తిపోతల జలపాతం నయాగరా అందాలను తలపిస్తోంది. ఈ దృశ్యాలను చూసేందుకు పలు ప్రాంతాల నుంచి పర్యాటకులు ఎత్తిపోతలకు తరలి వస్తున్నారు.