Electricity Struggle Committee Press Meet : 'యాజమాన్యానికి, కార్మికుల మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది ప్రభుత్వమే'
🎬 Watch Now: Feature Video
Electricity Struggle Committee Press Meet : విద్యుత్ కార్మికులకు, యాజమాన్యానికి మధ్య ఘర్షణ వాతావరణం సృష్టించింది ప్రభుత్వమే అని ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ నాయకులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో విద్యుత్ కాంట్రాక్టు కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ప్రభుత్వాన్ని అడిగినందుకు ఇలా చేశారని విమర్శించారు. విజయవాడలో ట్రేడ్ యూనియన్స్ కమిటీ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు.
మీడియా సమావేశంలో కమిటీ నాయకులు మాట్లాడుతూ.. చట్టం ప్రకారం రెండేళ్లకొకసారి విద్యుత్తు సంఘంలో ఎన్నికలు జరగాలి. కానీ, ఇంతవరకూ ఎలాంటి ఎన్నికలు జరగలేదు. కార్మికుల ద్వారా కాకుండా యాజమాన్యం తమకు అనుకూలంగా ఉన్న ఉద్యోగ సంఘాలకు గుర్తింపు ఇస్తోంది అని విమర్శించారు. అనేక రకాల కొత్త జీవోలు పెట్టి.. కొత్త నిబంధనల పేరుతో కార్మికులను ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు. వేతన సవరణ పేరుతో ఉద్యోగులకు కేవలం 2 శాతం జీతం పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. మా బాధలు చెప్పుకోవడానికి కూడా కార్మికులు అందరం రావాలని అనుకున్నాం. వాటికి అనుమతి లేదంటూ నిరాకరించి, నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు. సర్వీసులకు అనుగుణంగా కొత్త ఉద్యోగాలను ప్రకటించాలని, కాంట్రాక్టు కార్మికులను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. తమ నిరసనలపై న్యాయస్థానాల నిర్ణయం మేరకు నడుచుకుంటామని స్పష్టం చేశారు.