ముఖ్యమంత్రి తెలివితక్కువ నిర్ణయాలతో రైతులకు ఇబ్బందులు: దేవినేని ఉమ
🎬 Watch Now: Feature Video
Devineni Uma Questions CM Jagan Over Farmers Problems: సీఎం జగన్ చేతకానితనం వల్ల రైతులు భారీగా నష్టపోయారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పట్టిసీమ పంపులు పీకాలన్న దుర్మార్గమైన ఆలోచనతో, నాలుగేళ్లు పంటలు లేకుండా పోయాయని విమర్శించారు. జూలై నెలలో పట్టిసీమ ద్వారా నీరు వదిలి ఉంటే నేడు రైతులకు ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. గత ప్రభుత్వంలో పట్టిసీమ నీరుతో బంగారం పండించిన రైతులు, వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఇబ్బందులు పడుతున్నారని దేవినేని ఆరోపించారు. పట్టిసీమ ద్వారా నీళ్లు ఇవ్వకపోవడం వల్లే రైతుల చేతికి 25 బస్తాలు కూడా వచ్చే పరిస్థితులు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి తీసుకున్న తెలివితక్కువ నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బందులు పడుతున్నారని దేవినేని ఆరోపించారు.
తాజేపల్లికి వాటాలు: తుపాన్ కారణంగా పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలని దేవినేని ఉమా డిమాండ్ చేశారు. ఆర్బీకే సెంటర్లు దళారీపాత్రను పోషిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తడిసి, రంగుమారి, మొలకెత్తిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖమంత్రి గతంలో పర్యటనకు వచ్చి తాను ఎదో ఉద్దరిస్తానని చెప్పారని, మళ్లీ కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. రైతుల వద్ద దోచుకున్న సొమ్ములో తాడేపల్లికి వాటాలు వెళ్తున్నాయన్నారు. రైతుల బాధలు వినే తీరిక ఎమ్మెల్యేలు, మంత్రులకు లేకుండా పోయిందని విమర్శించారు.
బూతులు తిట్టే వారికే వైఎస్సార్సీపీలో టికెట్లు: చంద్రబాబు, లోకేశ్, పవన్ ను బూతులు తిట్టే వారికే వైఎస్సార్సీపీలో టికెట్లని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు దుయ్యబట్టారు. తన పని అయిపోయిందని వైఎస్ జగన్ కు అర్థమయిందని అన్నారు. తన అవినీతి, అరాచక పాలనపై వ్యతిరేకత ఉంటే జగన్ ఎమ్మెల్యేలను మారుస్తున్నాడని ఆరోపించారు. జగన్ పాలన రాష్ట్రానికి అరిష్టంలా దాపురించిందని మండిపడ్డారు. విభజన కంటే వైఎస్సార్సీపీ పాలనలోనే రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు. ఈ అరాచక ప్రభుత్వం పోతేనే రాష్ట్రానికి మోక్షమని రానున్న ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ముఖ్యమంత్రిని మార్చనున్నారని దేవినేని ఉమామహేశ్వరరావు తెలిపారు.