AP E Autos: ఈ-ఆటోలను ప్రారంభించిన సీఎం జగన్.. - నేటి తాజా వార్తలు
🎬 Watch Now: Feature Video
CM Jagan Started AP E Autos : క్లీన్ ఆంధ్రప్రదేశ్లో భాగంగా తడి పొడి చెత్తను వేర్వేరుగా సేకరించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చెత్తను సేకరించిందుకు ప్రవేశ పెట్టిన ఆటోలను తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం వద్ద సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 36 మున్సిపాలిటీలలో ఈ-ఆటోలు సేవలను అందించనున్నాయి. మొత్తం 516 ఈ-ఆటోలను ముఖ్యమంత్రి ఈ కార్యక్రమం ద్వారా ప్రవేశపెట్టారు. రాష్ట్రాన్ని క్లీన్ ఆంధ్రప్రదేశ్గా మార్చాలన్న ధృడ సంకల్పంతోనే వీటిని ప్రారంభించినట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పర్యావరణ హితంగా ఉంటూ.. చిన్న మున్సిపాలిటీలపై నిర్వహణ భారం తగ్గేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మంత్రి వివరించారు. ఇప్పటికే తడి, పొడి, హానికర వ్యర్థాల కోసం చెత్తను సేకరించేందుకు.. నీలం, ఆకుపచ్చ, ఎరుపు రంగుల చెత్త బుట్టలను పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. గ్రేడ్-1 ఆపై స్థాయి మున్సిపాలిటీల్లో చెత్త సేకరణకు.. 2వేల 525 పెట్రోల్, డీజిల్, సీఎన్జీ సహాయంతో నడుస్తున్న గార్బేజ్ టిప్పర్లను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇప్పటికే ఈ ఆటోలను నడపటానికి డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. వీరిలో మహిళా డ్రైవర్లు కూడా ఉన్నారు. ఇంటింటికి తిరిగి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించి ఈ ఆటోల ద్వారా డంపింగ్ యార్డు, ప్రాసెసింగ్ ప్లాంటుకు తరలిస్తారు.