మిచౌంగ్ తుపానుపై అప్రమత్తమైన ప్రభుత్వం - సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని సీఎం ఆదేశం - Jagan review on Cyclone
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 5:46 PM IST
CM Jagan Review with Officials on Michong Cyclone: తుపాను పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను సీఎం జగన్ ఆదేశించారు. మిచౌంగ్ తుపాను దృష్ట్యా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. పకడ్బందీగా సహాయక చర్యలు చేపట్టేందుకు అన్ని రకాలుగా సిద్ధంగా ఉండాలని, శిబిరాల్లో సౌకర్యాలు ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఆహారం, తాగునీరు, మందుల సరఫరా, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. తుపాను వల్ల విద్యుత్, రవాణా, సమాచార, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే యుద్ధప్రాతిపదికిన వాటిని పునరుద్ధరించేందుకు అన్నిరకాలుగా సిద్ధంగా ఉండాలని ఆయా విభాగాలను ఆదేశించారు. తుపాను పరిస్థితులు, చేపడుతున్న సహాయక చర్యలపై ఎప్పటికప్పుడు తనకు నివేదించాలని చెప్పారు.
పొలాల్లో ఉన్న ధాన్యం తడిచిపోకుండా వెంటనే మిల్లులు లేదా భద్రతమైన ప్రాంతాలకు వాటిని తరలించే విధంగా పౌరసరఫరాల శాఖకు చెందిన అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు.. తేమ లాంటి సాంకేతిక అంశాలను పక్కనపెట్టి రైతుల వద్దనున్న ధాన్యాన్ని వెంటనే ప్రొక్యూర్ చేసి, ఆ ధాన్యాన్ని భద్రమైన ప్రాంతాలకు తరలించాలని సీఎం స్పష్టం చేశారు. తుపాను కారణంగా భారీవర్షాలు వచ్చే అవకాశం ఉన్నందున జలవనరులశాఖ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలలు భారీవర్షాల కారణంగా వచ్చే పరిస్థితులను ఎదుర్కోవడానికి అప్రమత్తంగా ఉండాలని, తుపాను అనంతరం యుద్ధప్రాతిపదికన ఆయా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాలని సీఎం పేర్కొన్నారు.