Jagan Illegal Assets: వాన్‌పిక్ కేసు.. జప్తు చేసిన భూముల విడుదల.. ఈడీకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు - Vanpic Case Updates
🎬 Watch Now: Feature Video
CM Jagan Illegal Assets Case: జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా వాన్‌పిక్ కేసులో గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో జప్తుచేసిన 11వేల 804 ఎకరాల భూములను జప్తు నుంచి విడుదల చేయాలని.. ఈడీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఆస్తుల జప్తు చట్ట విరుద్ధమని చెబుతూనే వాటి విడుదలకు కింది కోర్టును ఆశ్రయిచాలంటూ.. దిల్లీలోని అప్పీలేట్ ట్రైబ్యునల్ చెప్పడాన్ని తప్పుబట్టింది. 2017లో 148.08 కోట్ల విలువకు సంబంధించి 11వేల 804 ఎకరాల ఎసైన్డ్ భూముల జప్తుపై అప్పీలేట్ అథారిటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. వాన్‌పిక్ ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్, వాన్‌పిక్ పోర్ట్స్ లిమిటెడ్.. 2020లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. విచారణ జరిపిన ధర్మాసనం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో భాగంగా సీబీఐ కేసు ఆధారంగా ఈడీ 2014లో మొదటి విడతగా 23.23 కోట్లకుగాను వాన్‌పిక్ పోర్ట్స్‌కు చెందిన 561.19 ఎకరాలు, 27.72 కోట్లకు గాను వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌కు చెందిన 855.71 ఎకరాలను జప్తు చేసింది.2017లో 148.08 కోట్లకు గాను 11వేల804.78 ఎకరాల ఎసైన్డ్ భూములను తాత్కాలికం జప్తు చేసింది. దిన్నీ ధ్రువీకరిస్తూ దిల్లీలోని ఎడ్జ్యుకేటింగ్ అథారిటీ ఉత్వర్యులు జారీ చేసింది. వీటిని సవాల్ చేస్తూ వాన్‌పిక్ కంపెనీలు అప్పిలేట్ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించాయి. 2019లో ట్రైబ్యునల్ ఉత్తర్వులు జారీచేస్తూ తాత్కాలిక జప్తు ఉత్తర్వులు చట్ట విరుద్ధమని పేర్కొంది.
తాత్కాలిక జప్తు సమయంలో ఇది నేరపూరిత సొమ్ము అని దర్యాప్తు సంస్థ విశ్వాసంలోకి తీసుకోవడానికి కారణాలను వివరించాల్సి ఉందని.. ఎలాంటి కారణాలు లేకపోయినా ఎడ్జ్యుకేటింగ్ అథారిటీ జప్తును సమర్థించడం సరికాదని పేర్కొంది. ఎలాంటి క్విడ్ ప్రో కో లేదని, జప్తు వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, కోర్టులో కేసు విచారణ పూర్తిచేయడానికి ఏళ్లు పడుతుందని అంతవరకూ ప్రజాప్రయోజనాలకు చెందిన ఆస్తుల జప్తు సరికాదని స్పష్టం చేసింది.
ఆస్తుల విడుదలకు కింది కోర్టులకు వెళ్లాలని సూచించింది. వీటిపై వాన్‌పిక్ కంపెనీలు ధాఖలు చేసిన మూడు అప్పీల్లపై రెండింటిలో గతేడాది జులైలో తెలంగాణ హైకోర్టు తీర్పు వెలువరించింది. 1416 ఎకరాల పట్టా భూములను జప్తు నుంచి విడుదల చేయాలంటూ తీర్పులో స్పష్టం చేసింది. నిబంధనలను పాటించకుండా ఈడీ జప్తు చేసిందని, దీన్ని సమర్థిస్తూ చట్టవిరుద్ధంగా ఎడ్జ్యుకేటింగ్ అథారిటీ ఉత్తర్వులు ఇచ్చిందంటూనే.. ఆ చట్ట ఉల్లంఘనను కొనసాగించాలంటూ అప్పీలేట్ ట్రైబ్యునల్ చెప్పడం సరికాదని తీర్పులో పేర్కొంది. చట్టవిరుద్ధమని తేలినప్పుడు ఆస్తులను విడుదల చేయాలని చెప్పే అధికారాన్ని ట్రైబ్యునల్ వినియోగించకోకుండా కింది కోర్టుకు వెళ్లడం సరికాదని వ్యాఖ్యానించింది. ఇవే కారణాలు ప్రస్తుత అప్పీలుకూ వర్తిస్తాయని తెలంగాణ హైకోర్టు స్పష్టంచేసింది. 11,804 ఎకరాల ఎసైన్డ్ భూములను విడుదల చేయాలని ఈడీని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది.