Children washed Anaparthi MLA's feet: ఎమ్మెల్యే సూర్యనారాయణకు పాదపూజ.. వీడియో వైరల్ - Children washed MLA Suryanarayana reddy feet
🎬 Watch Now: Feature Video
Children washed MLA Suryanarayana reddy feet: తూర్పుగోదావరి జిల్లా అనపర్తి ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.. మహిళలు, చిన్నారులతో కాళ్లు కడిగించుకోవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. పెదపూడి మండలం రామేశ్వరంలో గత నెల 30వ తేదీన రాత్రి నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఓ నివాసానికి ఎమ్మెల్యే వెళ్లారు. అక్కడి మహిళలు, చిన్నారులు ఆయన కాళ్లను చేతులతో కడిగి.. వస్త్రంతో తుడిచారు. దీనిపై విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై పెదపూడి మహిళా సమాఖ్య అధ్యక్షురాలు బి.విజయకుమారి స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అమ్మఒడి పథకంలో భాగంగా తమ ఖాతాలకు నగదు జమ కావడంతో కాళ్లు కడిగి సన్మానం చేద్దామని తన మనవరాళ్లు అడిగారని, వారి కోరిక మేరకు ఎమ్మెల్యే తమ ఇంటికి వచ్చినపుడు అలా చేశామన్నారు. దీన్ని కొందరు రాజకీయ చేయడం సరికాదన్నారు.
ఏ యుగంలో ఉన్నామో అర్థం కావట్లేదు: చిన్నపిల్లలతో ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి కాళ్లు కడిగించుకోవడం చూస్తుంటే రాతియుగంలో ఉన్నామో.. ఆధునిక యుగంలో ఉన్నామో అర్థం కావట్లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి విమర్శించారు. ఆయన బుధవారం విలేకర్లతో మాట్లాడుతూ.. చిన్నపిల్లలు కాళ్లు కడుగుతుంటే వారించాల్సింది పోయి.. నవ్వుతూ చూడటాన్ని ఏమనాలన్నారు. ఇటీవల ప్రధాని మోదీ.. పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగి గౌరవిస్తే.. ఇక్కడ చిన్న పిల్లలు, మహిళలతో కాళ్లు కడిగించుకోవడం హేయమైన చర్య అన్నారు. ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.