సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా ? జగన్ రెడ్డి పాలేరా !: బొండా ఉమా - బొండా ఉమా వివరాలు
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 23, 2023, 4:53 PM IST
Bonda Uma Sensational Comments on AAG Ponnavolu: జైలు జీవితం గడిపిన జగన్.. ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులపై, సుప్రీంకోర్టు జడ్జీపై అపవాదు వేసిన చరిత్ర దేశచరిత్రలో ఎన్నడూ చూడలేదని తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. సీఐడీ చీఫ్ సంజయ్.. ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ప్రజల సొమ్ము జీతంగా తీసుకుంటూ, రాజకీయ నాయకుల కన్నా హీనంగా బరితెగించి ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. జగన్ రెడ్డి చెప్పినట్టు ఆడుతూ.. కట్టుకథలతో ప్రజల్ని మోసగిస్తూ, వ్యవస్థల్ని కుంగదీస్తున్నారని ఉమా దుయ్యబట్టారు. సుధాకర్ రెడ్డి అడిషనల్ అడ్వకేట్ జనరలా.. లేక జగన్ రెడ్డి పాలేరా అని నిలదీశారు.
ముఖ్యమంత్రిపై సుధాకర్ రెడ్డికి వల్లమాలిన ప్రేమాభిమానాలుంటే.. నల్లకోటు వదిలేసి శాశ్వతంగా జగన్కు ఊడిగం చేసుకోవచ్చని బోండా ఉమామహేశ్వరరావు హితవు పలికారు. ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. తెలుగుదేశం ఖాతాల్లోకి డబ్బులు వచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించాలని ఉమా డిమాండ్ చేశారు. గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. పొన్నవోలు సీఎం జగన్ పాలేరులా వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ కక్ష సాధింపు రాజకీయాలను ప్రజలు అసహ్యించుకుంటున్నారని బొండా ఉమా తెలిపారు.