BJP Satyakumar Fire on YSRCP Govt : 'అరాచక పాలన నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించడంపైనే దృష్టి.. పొత్తులను కేంద్రమే నిర్ణయిస్తుంది' - విజయవాడ లేటెస్ట్ న్యూస్
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 3, 2023, 5:36 PM IST
BJP Satyakumar Fire on YSRCP Govt : ఎన్నికల పొత్తులను కేంద్రమే నిర్ణయిస్తుందని.. ప్రస్తుతం అరాచక పాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేయడంపైనే తమ దృష్టి ఉందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ అన్నారు. విజయవాడలోని ఖాదీ గ్రామోద్యోగ ఎంపోరియాన్ని సందర్శించిన ఆయన.. బీజేపీతో జనసేన పొత్తు కొనసాగుతోందనే తాము విశ్వసిస్తున్నామని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు త్వరత్వరగా మారుతున్నాయన్నారు. రాష్ట్రంలో ప్రజాకంటక పాలన సాగుతోందని.. అరాచకపాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించడమే ఉద్దేశంగా బీజేపీ పనిచేస్తోందన్నారు. ప్రజ్యా వ్యతిరేక పాలనలోని అంశాలను ఎండగడుతూ.. ప్రజల ఆదరణ పొందేందుకు తాము ప్రయత్నిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలకు ఇస్తున్న నిధులను సైతం దారిమళ్లిస్తున్న క్రమాన్ని ఎండగడతామన్నారు.
విజయవాడలోని ఖాదీ గ్రామోద్యోగ్ ఎంపోరియాన్ని సత్యకుమార్‌తోపాటు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీవీఎన్ మాధవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి లంక దినకర్ తదితరులు సందర్శించారు. మహాత్మాగాంధీ ప్రవచించిన విలువలు పాటిస్తూ.. వారు చూపించిన ఆశయాలను బీజేపీ కొనసాగిస్తోందన్నారు. గ్రామాల ఆర్థికాభివృద్ధికి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చామన్నారు. పంటలకు పెట్టుబడి సాయం.. పంటల బీమా పథకం, గ్రామాలకు రహదారి సౌకర్యం, ఇళ్ల నిర్మాణం, ఉపాధికి నిధులు వంటి వాటి ద్వారా గ్రామ స్వరాజానికి పునాదులు వేస్తూ తొమ్మిదిన్నరేళ్ల నరేంద్రమోదీ పాలన సాగిందన్నారు. చేతివృత్తిదారులను ప్రోత్సహించేందుకు విశ్వకర్మ యోజన పరిట రూ.13 వేల కోట్ల పథకాన్ని అమలు చేస్తూ.. దేశ సాంస్కృతిక సంపదను పరిరక్షిస్తున్నామని తెలిపారు.