ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి - దీక్ష విరమణకు పెద్ద ఎత్తున తరలివచ్చిన భవానీలు - Bhavani Deeksha news
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/07-01-2024/640-480-20452056-thumbnail-16x9-bhavani-deeksha.jpg)
![ETV Bharat Andhra Pradesh Team](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/authors/andhrapradesh-1716535904.jpeg)
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 7, 2024, 6:49 PM IST
Bhavani Deeksha Viramana concludes: విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ అత్యంత భక్తిశ్రద్ధల మధ్య ముగిసింది. ఆలయ పాలకమండలి ఛైర్మన్ కర్నాటి రాంబాబు, ఈవో రామారావు, అధికారులు అర్చకుల ఆధ్వర్యంలో ఘనంగా పూర్ణాహుతి నిర్వహించి భవానీ దీక్షలకు ముగింపు పలికారు. ఐదు రోజులపాటు జరిగిన ఈ కార్యక్రమంలో నాలుగున్నర లక్షల మంది వరకు భక్తులు వచ్చినట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏటా కార్తికశుద్ధ ఏకాదని నుంచి మార్గశిర శుద్ధ ఏకాదశి వరకు మండల, అర్ధమండల దీక్షలతో భవానీ భక్తులు కనకదుర్గమ్మ సన్నిధికి తరలిరావడం ఆనవాయితీగా వస్తోంది.
ఏటా దసరా సమయంలో కొందరు భక్తులు భవానీదీక్షలు చేస్తుంటారు. దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం మాత్రం దసరా రద్దీని దృష్టిలో ఉంచుకుని నవంబరు, డిసెంబరు నెలల్లోనే దీక్షల నిర్వహణను ప్రోత్సహిస్తోంది. ఈనెల మూడో తేదీ నుంచి ప్రారంభమైన భవానీదీక్షలు ఇవాళ ఉదయం పూర్ణాహుతితో పూర్తయ్యాయి. ఈ ఐదు రోజుల్లోను సుమారు 15 లక్షల వరకు లడ్డుప్రసాదాలను విక్రయించారు. ఐదు వందలు, మూడు వందలు, వెయ్యి రూపాయల దర్శన టిక్కెట్లను విక్రయించారు.
ముగింపు సందర్భంగా, అర్ధరాత్రి నుంచే భక్తులు గిరిప్రదక్షణ చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. మల్లికార్జున మహామండపంలోని కౌంటర్ల వద్ద ఇరుముడులను గురుభవానీలకు అందజేశారు. అనంతరం దేవస్థానం ఏర్పాటు చేసిన అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దుర్గమ్మ తల్లీ దండాలు అంటూ భక్తులు ఆర్తిగా అమ్మవారిని దర్శించుకుని తమ మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారనే అంచనాతో దేవస్థానం యంత్రాంగం అనేక ముందుజాగ్రత్త చర్యలు చేపట్టడంతో ఎక్కడా ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా దీక్ష విరమణ క్రతువు సాఫీగా సాగిందని ఆలయ పాలకమండలి ప్రకటించింది.