Attack on Army Jawan Parents in Chinna Kudala: ఆర్మీ జవాన్ తల్లిదండ్రులపై దాడి.. పట్టించుకోని పోలీసులు.. వీడియో వైరల్ - YSR District crime News
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 7, 2023, 10:47 PM IST
Attack on Army Jawan Parents in Chinna Kudala: ఏ తప్పు చేయని తన తల్లిదండ్రులపై ఓ కుటుంబం అన్యాయంగా దాడి చేసిందని, దాడి చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయలంటూ పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోవటం లేదని.. ఆర్మీలో పని చేస్తున్న ఓ జవాన్ ఆవేదన వ్యక్తం చేశాడు. దేశం కోసం సేవ చేస్తున్న తన (ఆర్మీ) కుటుంబానికి గ్రామంలో రక్షణ కరువైందని వాపోయాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
అసలు ఏం జరిగిందంటే.. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం చిన్న కుడాల గ్రామానికి చెందిన రామాంజుల రెడ్డి ఆర్మీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. తాజాగా ఇంటి వద్ద ఓ చిన్న విషయానికి అతని తల్లిదండ్రులు అప్పిరెడ్డి, పార్వతమ్మపై.. ఇంటి పక్కనున్న విశ్వనాథరెడ్డి కుటుంబం తీవ్రంగా దాడి చేసింది. విషయం తెలుసుకున్న జవాన్ రామాంజుల రెడ్డి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలంటూ పోలీస్ అధికారులకు, ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. అనంతరం సెప్టెంబరు 20వ తేదీన జరిగిన ఘటనపై నేరుగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటిదాకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దేశ సేవ కోసం పని చేస్తున్న ఆర్మీ కుటుంబానికే రక్షణ కరువైందని జవాన్ వాపోయాడు. పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశాడు. దాడికి సంబంధించిన సీసీ ఫుటేజ్‌లను ఉన్నతాధికారులకు పంపించాడు. తన తల్లిదండ్రులపై దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని వేడుకున్నాడు.