నీటి విడుదలను నిలిపివేసిన ఏపీ అధికారులు - వివాదం పరిష్కారానికి 6న దిల్లీలో సమావేశం - AP Telangana krishna river management board issue
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Dec 3, 2023, 11:26 AM IST
AP Govt Stopped Nagarjuna Sagar Water Release: తెలుగు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతకు కారణమైన సాగర్ కుడికాలువ నీటి విడుదలను ఏపీ అధికారులు అర్ధరాత్రి నిలిపివేశారు. తొలుత నీటి విడుదల కొంతమేర కొనసాగుతుందని ప్రటించినప్పటికీ రాత్రి పదిన్నర గంటల తర్వాత ఆపేశారు. మరోవైపు విజయపురి సౌత్ ఠాణాలో తెలంగాణ ఎస్పీఎఫ్ (Special Protection Force) పోలీసులపై రెండు కేసులు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ జలవనరుశాఖ అధికారుల ఫిర్యాదు మేరకు ఈ కేసులు నమోదు చేశారు.
తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసులకు చెందిన కొందరు సిబ్బంది తనను కులం పేరుతో దుర్భాషలాడినట్లు ఏఎస్ఐ సోమ్లా నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. విజయపురిసౌత్ వైపు ప్రాజెక్టు ముఖద్వారంలో ఉన్న పోలీసు కంట్రోల్ గార్డు రూమ్‌పై ఉన్న పేరును మార్చారు. గతంలో తెలంగాణ ప్రత్యేక పోలీసు గార్డు గది పేరుతో ఉండగా దానిని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గార్డు గదిగా ఆంగ్ల అక్షరాలతో రాశారు. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న కృష్ణా జలవివాదంపై సంయమనం పాటించాలని కేంద్రం కోరింది. సమస్యను పరిష్కరించేందుకు ఈ నెల 6వ తేదీన దిల్లీలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది.