Venkatarami Reddy Vs Bopparaju: బొప్పరాజు ఎన్నికల వరకు ఉద్యమిస్తూనే ఉంటారు: వెంకట్రామి రెడ్డి
🎬 Watch Now: Feature Video
AP GEF Association President Venkatrami Reddy comments: ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లుపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు కె.వెంకట్రామిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల బలం లేకుండానే బొప్పరాజు వెంకటేశ్వర్లు రెవెన్యూ ఉద్యోగుల సంఘాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల కోసం ఉద్యమాలు చేసిన చరిత్రలు వారికి లేవని, వారి సొంత గుర్తింపు కోసమే ఉద్యమాలు చేస్తున్నారని విమర్శించారు.
వివరాల్లోకి వెళ్తే.. విజయవాడలోని సచివాలయంలో వెంకట్రామిరెడ్డి నాయకత్వం వహిస్తున్న ఏపీ జీఈఎఫ్ సంఘంలోకి కొంతమంది రెవెన్యూ ఉద్యోగుల సంఘం నేతలు చేరారు. ఈ సందర్బంగా వారిని సంఘంలోకి ఆహ్వానించిన వెంకట్రామి రెడ్డి.. ఉద్యోగుల కోసం సంఘం చేస్తున్న పోరాటాలపై మీడియాతో మాట్లాడారు. ఈ క్రమంలో ఏపీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల డిమాండ్ల కోసం మూడు దశలుగా ఉద్యమం చేస్తామంటూ బొప్పరాజు వెంకటేశ్వర్లు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు.
అంతేకాకుండా, కనీసం ఆయన వద్ద 5 వేల మంది ఉద్యోగుల సభ్యత్వం కూడా లేదని వెంకట్రామి రెడ్డి ఆరోపించారు. ఉద్యోగుల డిమాండ్ల కోసం మూడు దశల ఉద్యమం అంటున్న బొప్పరాజు ఎన్నికల వరకు 10-15 దశలంటూ ఉద్యమిస్తూనే ఉంటారని ఆక్షేపించారు. ఆయన వల్ల ఉద్యోగుల సమస్యలేవి పరిష్కారం కావని వ్యాఖ్యానించారు. తన వ్యక్తిగత గుర్తింపు కోసమే ఉద్యమాలు చేస్తున్నారని ఆగ్రహించారు. ఉద్యోగుల సంక్షేమం గురించి తప్ప, ఉద్యోగ సంఘాల నేతల గురించి సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆలోచించరని వెంకట్రామి రెడ్డి పేర్కొన్నారు.
''ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఓట్లు సంపాదించే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి లేదు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య తరపున చాలా వరకు పరిష్కరించాం. త్వరలోనే మరికొన్ని సమస్యలపై సీఎం జగన్‌తో చర్చించనున్నాం. రెవెన్యూ శాఖలోని వివిధ హోదాల్లో ప్రమోషన్లు, ఖాళీల భర్తీ జరిగేలా చూస్తాం. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల్లో ప్రభుత్వం చాలా వరకు ఇప్పటికే నేరవేర్చింది. రాబోయే రోజుల్లో సీపీఎస్ కూడా రద్దు అవుతుందనే విశ్వాసం మాకు ఉంది. కచ్చితంగా అవుతుంది'' -వెంకట్రామి రెడ్డి, ఏపీ జీఈఎఫ్ సంఘం అధ్యక్షులు