Praveen Prakash Fire on Teachers: సార్ వస్తున్నారు.. సార్లు జాగ్రత్తగా ఉండండి - ప్రవీణ్ ప్రకాశ్ తీరును తప్పు బట్టిన ఉపాద్యాయులు
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/640-480-18321596-471-18321596-1682180797404.jpg)
శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శనివారం ప్రవీణ్ ప్రకాశ్ పర్యటించారు. స్థానిక కండ్రవీధిలో విద్యార్థుల ఇళ్లకు నేరుగా చేరుకున్న ఆయన విద్యార్థుల పాఠ్య పుస్తకాలు పరిశీలించారు. వర్క్ బుక్‌లలో ఖాళీలు పూరించకపోవడం పట్ల తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. టెక్కలి మండల విద్యాశాఖ అధికారి నాగభూషణం, మరో ముగ్గురు ఉపాధ్యాయులపై క్రమశిక్షణ చర్యలకు ఆదేశించారు.
పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకొని పాఠశాలకు పంపిస్తే ఇదా పద్ధతి అంటూ ఆర్జేడి జ్యోతి కుమారి, డీఈఓ తిరుమల చైతన్య, డిప్యూటీ డీఇఓ పగడాలమ్మ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. రూ.15 వేలు ఫీజు తీసుకునే ప్రైవేటు పాఠశాలల్లో బ్రహ్మాండంగా బోధిస్తుంటే.. అంతకు ఐదు రెట్లు జీతాలు తీసుకుంటున్న ప్రభుత్వ ఉపాధ్యాయులు చేస్తున్న పని ఏమిటి అని ప్రశ్నించారు. ఎన్నికల విధుల్ని అంత పక్కాగా చేస్తున్న ఉపాధ్యాయులు ఉపాధ్యాయ వృత్తిలో ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. మంచిగా చదువు చెప్పిన ఉపాధ్యాయులను మెచ్చుకున్నారు. జిల్లా పర్యటన నుంచి అసంతృప్తి గానే వెళ్తున్నానని ప్రవీణ్ ప్రకాశ్ అన్నారు.
ప్రవీణ్ ప్రకాశ్ తీరును తప్పుబట్టిన ఉపాధ్యాయ సంఘాలు : ప్రభుత్వ విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి తీరుపై ఉపాధ్యాయ సంఘాలు తప్పుపట్టాయి. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన ఉపాధ్యాయులను, మండల విద్యాశాఖ అధికారులను భయభ్రాంతులకు గురి చేసేలా వ్యవహరించారని ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ అసోసియేషన్ ఆరోపించింది. విద్యార్థుల ఇళ్లకు నేరుగా వెళ్లి ఉపాధ్యాయుల పనితీరు పరిశీలించడం సరికాదని అన్నారు.