తుఫానుగా బలపడుతున్న అల్పపీడనం - కోస్తాంధ్ర ,సీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం
🎬 Watch Now: Feature Video
By ETV Bharat Andhra Pradesh Team
Published : Nov 29, 2023, 10:40 AM IST
AP Cyclone Alert : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నేడు వాయుగుండంగా మారి.. తుఫానుగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్ర సంచాలకులు వెల్లడించారు. దక్షిణ అండమాన్, మలక్కా జలసంధిలో ఏర్పడిన అల్పపీడనం పశ్చిమ-వాయవ్య దిశగా పయనించి గురువారానికి వాయుగుండంగా మారి.. అనంతరం అది వాయవ్య దిశగా కదిలి శనివారానికి ఆగ్నేయ బంగాళాఖాతంలో తుఫానుగా మారనున్నట్లు తెలిపారు. డిసెంబరు మొదటి వారంలో తుఫాను తీరం దాటొచ్చని, దీంతో రాష్ట్ర వ్యాప్తంగా రాబోయే 3 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని వివరించారు.
Ap Weather Report Today : కోస్తాంధ్ర, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో డిసెంబరు 4 నుంచి రెండు రోజుల పాటు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ విభాగ అధికారులు పేర్కొన్నారు. పంటలు కోత దశలో ఉండటంతో రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు వెనక్కి రావాలని హెచ్చరికలు జారీ చేశారు. నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో బుధవారం తేలికపాటి వానలు కురుస్తాయని వివరించారు.