'జగనన్న నువ్వు మోసగాడివన్నా.. మేము మోసపోయామన్నా' అంగన్వాడీల పాట - ఒంగోలులో అంగన్వాడీ కార్యకర్తల నిరసన
🎬 Watch Now: Feature Video
Anganwadi Employees Protest : తమ డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీ కార్యకర్తలు, ఆయాలు రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట సోమవారం బైఠాయించి నిరసన తెలిపారు. తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ.. డిమాండ్లతో కూడిన ప్లకార్డులను ప్రదర్శించారు. తమ సమస్యలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని నిరసన తెలిపారు. ఈ నిరసనలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు వినూత్నంగా తమ సమస్యలపై నిరసించారు.
సాధారణంగా సమస్యలను ప్లకార్డులు, నినాదల ద్వారా, ధర్నా, రాస్తారోకో, ర్యాలీ ఇలా వివిధ రూపాల్లో తెలియజేస్తారు. కానీ, ఒంగోలు కలెక్టరేట్ ఆవరణలో కొందరు కార్యకర్తలు, ఆయాలు పాటల రూపంలో తమ ఆవేదన వినిపించారు. సినిమా పాటలకు పేరడిగా తమ సమస్యలను గీతాల రూపంలో ఆలపించారు. అంగన్వాడీ కేంద్రలో పనిచేసే ఓ అయా తన ఆవేదనను పాటలాగా పాడి నిరసన తెలిపింది. మద్దతుగా అక్కడున్న వారు ప్రోత్సహిస్తూ చప్పట్లు కొట్టారు. అసలు అమె ఇంతకీ ఏం పాడిదంటే.
‘నువ్ మోసగాడివన్నా.. మేము మోసపోయినామన్నా.. నువ్ ఇంటికి పోతావన్నా’ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అంగన్‌వాడీ కార్యకర్తలు గీతాలు ఆలపించి నిరసన తెలిపారు. ‘అందమైనవాడా.. చందమామలాంటి జగనన్నా.. నువ్వు వచ్చినావని మురిసిపోతిమన్నా అంటూ గీతాన్ని ఆలపించింది. ఈ బండ కరిగిన కానీ, ఆ కొండ కరిగిన కానీ, నీ గుండె కరగదయ్యో.. నీ మనసు మారదయ్యో అని పాడి నిరసన తెలిపింది. అన్నీ పెంచినావు.. మా జీతం పెంచలేవా? అంటూ పాడి ముఖ్యమంత్రిని ప్రశ్నించింది. కరెంటు బిల్లు పెంచావు.. గ్యాసు బిల్లు పెంచి నోరు కొట్టినావు.. మా పొట్ట గొట్టినావు అంటూ ఆవేదనను వ్యక్తం చేసింది. అంగన్‌వాడీలనూ నువ్వు ఆగం చేసినావు.. నువ్వు ఇంక రావు అయ్యో.. నువ్వు ఇంటికి పోతావయ్యో’ అంటూ హెచ్చరిస్తూ రాగమెత్తింది.