AP Fruit and Flower Show 2024 in Vijayawada : సుందరమైన పూల మొక్కలు, పలు రకాల పండ్ల మొక్కలు, అందమైన వివిధ జాతుల వృక్షాలతో పాటు ఆహ్లాదాన్నిచ్చే మరెన్నో చిన్న చిన్న మొక్కలు విజయవాడ నగరవాసులను కట్టిపడేస్తున్నాయి. జాతీయ స్థాయిలో ఏర్పాటు చేసిన ఫల, పుష్ప ప్రదర్శనలో కొలువుదీరిన విభిన్న రకాల మొక్కలు, వ్యవసాయ ఉత్పత్తులు ప్రకృతి ప్రేమికులకు కనువిందు చేస్తున్నాయి.
రేపే చివరి రోజు : విజయవాడ పాలిక్లినిక్ రోడ్డులోని సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ఫల, పుష్ప ప్రదర్శన-2024కు విశేష స్పందన లభిస్తోంది. ఈ నెల 21న ప్రారంభమైన ఈ ప్రదర్శన 26తో ముగియనుంది. నగరంతో పాటు చుట్టు పక్క ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన సందర్శకులు మొక్కలు, వివిధ జాతుల చెట్లను, కుండీలు, గార్డెనింగ్ వస్తువులను ఆసక్తిగా తిలకిస్తున్నారు.
ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా పుణె, బెంగళూరు, కోల్‌కతా, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ప్రాంతాల నుంచి నర్సరీల నిర్వాహకులు ఈ ప్రదర్శనలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఇలాంటి ప్రాంగణంలో పెంచే మొక్కలతో పాటు, ఇంటి లోపల, టెర్రస్‌లపై పెంచేందుకు అనువుగా ఉండే మొక్కలు అందుబాటులో ఉంచారు. దేశవాళీ సంకర కూరగాయలు, పూలు, పండ్ల మొక్కలు, విత్తనాలను సైతం ప్రదర్శనకు ఉంచారు. ప్రదర్శనతో పాటు అమ్మకాలు నిర్వహిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వీక్షించడంతో పాటు తముకు కావాల్సిన మొక్కలను కొనుగోలు చేస్తున్నారు.
"గుడ్లు పెట్టి వెళ్లిన బట్టమేక పిట్ట - ఆ పక్షి కోసం 9చ.కి.మీ. భూమి వదిలేశారు" - సందర్శకులకు అనుమతి
ఆసక్తిగా తిలకిస్తున్న యువత : పూలు, పండ్ల మొక్కలతో పాటు గృహాలంకార మొక్కలు, ఔషధ మొక్కలు సైతం ప్రదర్శనలో కొలువుదీరాయి. మొక్కల సంరక్షణకు ఉపయోగించే సేంద్రీయ ఎరువులు, విత్తనాలు సైతం ప్రదర్శనలో విక్రయిస్తున్నారు. ఫల, పుష్ప ప్రదర్శనలో ఏర్పాటు చేసిన పూల ఆకృతులు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. దేశ, విదేశీ అరుదైన రంగు రంగు మొక్కలు, చూడచక్కని కుండీలను మహిళలు, యువత ఆసక్తిగా తిలకిస్తున్నారు. అన్ని రకాల మొక్కలు ఒకే దగ్గర దొరకడం ఆనందంగా ఉందని సందర్శకులు చెబుతున్నారు.
అన్ని వర్గాల వారికి ఉపయోగపడే ఫల, పుష్ప ప్రదర్శన కేవలం వారం రోజులే కాకుండా మరిన్ని రోజులు నిర్వహిస్తే బాగుంటుందని సందర్శకులు ఆభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
"ఇక్కడ చాలా రకాల మొక్కలు ఉన్నాయి.రకరకాల పూలు ఆకట్టుకుంటున్నాయి. చాలా ఆనందంగా ఉంది. పూల మొక్కలు చాలా తక్కువ ధరలో ఉన్నాయి"- సందర్శకులు
పర్యాటకులను ఆకర్షిస్తున్న రింగ్ రోడ్డు అడవి! - రోజుకు 10 వేల మంది సందర్శన