Manipur issue: 'ప్రభుత్వం నిర్లక్ష్యం.. ఆరురెట్ల ఛార్జీని చెల్లించి ఇల్లు చేరాను'

By

Published : May 8, 2023, 9:41 PM IST

thumbnail

Anantapur district student reached home safely: మణిపూర్‌లో తాజాగా చోటుచేసుకున్న అల్లర్లలో చిక్కుకొనిపోయిన విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు సరైన సమయంలో పట్టించుకోలేదని విద్యార్థులు, వారి తలిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ వర్సిటీ (ఎన్ఐటీ) వసతి గృహం పక్కనున్న నివాసాల మధ్య బాంబుల మోతలు, నిప్పుల రవ్వలతో కంటిమీద కునుకు లేకుండా నాలుగు రోజులపాటు భయం భయంతో గడిపామన్నారు. తాగునీరు లేక, బాత్ రూంలకు నీటి సరఫరా రాక నానా అవస్థలు పడ్డామన్నారు. అల్లర్లలో చిక్కుకొనిపోయిన వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి.. ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి వారిని సురక్షితంగా తీసుకెళ్లాయని.. తాను మాత్రం ఆరు రెట్లు విమాన ఛార్జీని చెల్లించి సురక్షితంగా ఇల్లు చేరానని అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని యజ్ఞశ్రీ.. మణిపుర్‌ అల్లర్ల నేపథ్యంలో ఆమె ఎదుర్కొన్న అనుభవాలను ఈటీవీ భారత్‌తో పంచుకున్నారు.

4 రోజులు కంటిమీద కునుకు లేదు.. మణిపుర్‌ అల్లర్ల కారణంగా 4 రోజులపాటు కంటిమీద కునుకు లేకుండా గడిపానని.. అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థిని యజ్ఞశ్రీ చెప్పారు. తాగునీరు మొదలుకొని బాత్ రూంలకు నీటి సరఫరా కూడా చేయలేదని తెలిపారు. అనంతరం మణిపూర్ ప్రభుత్వం విద్యార్థుల భద్రతను ఏమాత్రం పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. వివిధ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేసి సురక్షితంగా వారి ప్రాంతాలకు తీసుకెళ్తే.. తాను మాత్రం ఆరురెట్ల విమాన ఛార్జీని చెల్లించి.. సురక్షితంగా ఇల్లు చేరానని తెలిపారు. 

కలెక్టర్‌ గారు స్పందించలేదు.. యజ్ఞశ్రీ తల్లి మాట్లాడుతూ..''మా కుమార్తె మణిపుర్‌లో జరుగుతున్న అల్లర్ల గురించి ఫోన్ చేసి చెప్పినప్పుడు మేము చాలా భయపడ్డాం. వెంటనే జిల్లా కలెక్టర్‌ గారి దగ్గరికి వెళ్లాము. కానీ, వాళ్లు స్పందించలేదు. ప్రభుత్వం గానీ అధికారులు గానీ పట్టించుకోలేదు. అయినా మేము మా కూతుర్ని ఆరు రెట్ల ఛార్జీ (రూ.30,000)ని చెల్లించి ఇంటికి సురక్షితంగా రప్పించుకున్నాము. ప్రభుత్వం సరైన సమయంలో స్పందించి ఉంటే బాగుండేది. మిగతా విద్యార్థులు కూడా అక్కడ్నుంచి ఇక్కడి వస్తున్నారు అందుకు సంతోషంగా ఉంది.'' అని ఆమె అన్నారు. 

ఇంఫాల్ నుంచి 214 మంది విద్యార్థులు రాక.. మరోవైపు మణిపూర్ నుంచి తెలుగు విద్యార్థులు ఈరోజు హైదరాబాద్ చేరుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇంఫాల్ నుంచి ప్రత్యేక విమానంలో 214 మంది విద్యార్థుల్ని శంషాబాద్ విమానాశ్రయానికి తీసుకొచ్చింది. అందులో 108 మంది ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు, 106 మంది తెలంగాణకు చెందిన విద్యార్థులున్నారు. అక్కడి నుంచి వారందరినీ స్వస్థలాలకు తరలించేందుకు రాష్ట్ర ప్రత్యేక బస్సులను సిద్ధం చేసింది. విద్యార్థులకు భోజనం, ఇతర సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.